‘నానో ఫోన్ సి’ గా పిలిచే ప్రపంచంలోనే అతిచిన్న ఫోన్ ఇప్పుడు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేసింది. రష్యా కంపెనీ ‘ఎలారీ’ తయారుచేసిన ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఢిల్లీకి చెందిన ఈ-కామర్స్ సంస్థ యెహ్రా డాట్ కామ్ ప్రకటించింది. ఎలారీ ‘యాంటీ-స్మార్ట్‌ఫోన్’ మోడల్ అయిన ‘నానో ఫోన్ సి’కి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని యెహ్రా డాట్ కామ్ సీఈవో మణికాంత్ జైన్ తెలిపారు. నానో ఫోన్ సి ధర రూ.3,940గా ఉంది.
సాంకేతికతను భారతీయులకు అందించడంలో తాము ముందుంటామని తెలిపారు. ‘నానో సి’ ని ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లతో అనుసంధానం చేసుకోవచ్చని ఆయన వివరించారు. స్మార్ట్‌ఫోన్‌లోని వెయ్యి కాంటాక్ట్‌లను సింగిల్ క్లిక్‌తో ఈ ఫోన్లో కాపీ చేసుకోవచ్చని తెలిపారు. రోజ్, గోల్డ్, బ్లాక్ అండ్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉన్నట్టు జైన్ పేర్కొన్నారు.
ఇవి స్పెపిఫికేషన్లు… 7.6 మిల్లీమీటర్ల మందం, 94.4 X 35.85 మిల్లీమీటర్లతో ఉన్న ఈ ఫోన్ బరువు 30 గ్రాములు మాత్రమే. ఇక ఫీచర్ల విషయానికొస్తే 1 అంగుళం టీఎఫ్టీ డిస్ప్లే, 32 జీబీ మైక్రో ఎస్డీ, మైక్రో సిమ్ కార్డ్ స్లాట్లు, ఎంపీ 3 ప్లేయర్, ఎఫ్ఎం రేడియో, అలారం ఉన్నాయి.