కోవిడ్ పరిస్థితుల నుండి పరిశ్రమలన్ని కోలుకొంటున్న నేపథ్యంలో సింగరేణి బొగ్గుకి సాధారణ స్థాయి డిమాండ్ వస్తోందనీ, కనుక ఈ ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన ఫిబ్రవరి, మార్చి నెలల్లో రోజుకి 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా కృషి చేయాలని సి&ఎం.డి. శ్రీ ఎన్.శ్రీధర్ అన్ని ఏరియాల జి.ఎం. లను ఆదేశించారు.
బుధవారం (ఫిబ్రవరి 3వ తేదీ) నాడు హైద్రాబాద్ సింగరేణి భవన్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి నెలలో రోజుకి 1.95 లక్షల టన్నుల బొగ్గు రవాణా, మార్చి నెలలో రోజుకి 2 లక్షల టన్నుల రవాణా జరపడానికి సంసిద్ధం కావాలని, అలాగే ఫిబ్రవరి లో రోజుకి 13.70 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెను, మార్చి నెలలో 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెను తొలగింపు లక్ష్యంగా పెట్టుకొని ముందుకుపోవాన్నారు. ఫిబ్రవరి, మార్చి నెలలతో పాటు 2021-22 ఆర్ధిక సంవత్సరంలోని ఏప్రిల్, మే నెలల వరకూ దూకుడుగా ఉత్పత్తిని సాధించాలనీ, జూలై నెల నుండి వర్షాలు పడే అవకాశం ఉన్నందున తగు ముందస్తు జాగ్రత్తలకు ఇప్పటినుండే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
2021-22 ఆర్ధిక సంవత్సరంలో 700 లక్షల టన్నుల లక్ష్యంగా ముందుకు ఈ సందర్భంగా ఆయన వచ్చే ఆర్ధిక సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాలు, ఇందుకోసం ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. 2021-22 నాటికి నాలుగు కొత్త ఓపెన్‌కాస్టు గనుల నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభమవుతుందనీ, అడ్రియా లాంగ్ వాల్ కొత్త ప్యానెల్ నుండి కూడా బొగ్గు ఉత్పత్తి యథావిధిగా జరుగనుందనీ కనుక వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోవాలని నిర్దేశించారు.
బొగ్గు మార్కెట్టు క్రమంగా పుంజుకొంటున్న నేపథ్యంలో సింగరేణి బొగ్గు మార్కెట్టును 100 మిలియన్ టన్నుల వరకూ విస్తరించేలా తద్వారా 70 మిలియన్ టన్నుల రవాణాకు మార్కెటింగ్ విభాగం వారు పలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలతో అవగాహన కుదుర్చుకోవాలని ఆదేశించారు. డిసెంబర్, జనవరి నెలల ప్రగతిని ప్రతీ ఏరియా జి.ఎం.తో సమీక్షించిన ఆయన మణుగూరు ఏరియా సాధించిన ప్రగతిని ప్రశంసించారు. నిర్దేశిత లక్ష్యాలు సాధించడానికి ప్రతీ ఏరియా పోటీతత్వంతో ముందుకు సాగాలని సూచించారు. కొత్తగా ప్రారంభించాల్సి ఉన్న వెంకటాపూర్ ఓ.సి., రొంపేడు ఓ.సి., కె.టి.కె. ఓ.సి. విస్తరణ, గోలేటి ఓ.సి., ఎం.వి.కె. ఓ.సి., జి.డి.కె. 10 ఓ.సి. గనులకు అనుమతులు పొందడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించారు. వచ్చే ఏడాది సాధించాల్సిన లక్ష్యాలు, వర్షకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొత్తగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్న పనుల ఒప్పందాలు, కాంట్రాక్టులకు సంబంధించి ఫిబ్రవరి 10, 11 తేదీల్లో డైరెక్టర్లు, ఉన్నత స్థాయి అధికారులతో ఒక మేథోమథన సదస్సును హైద్రాబాద్ లో నిర్వహించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఇ.డి. కోల్ మూమెంట్ శ్రీ జె.ఆల్విన్, అడ్వయిజర్ మైనింగ్ శ్రీ డి.ఎన్.ప్రసాద్, అడ్వయిజర్ ఫారెస్ట్రీ శ్రీ కె.సురేంద్రపాండే, జి.ఎం. (సి.డి.ఎన్.) శ్రీ కె.రవిశంకర్, జి.ఎం. (మార్కెటింగ్) శ్రీ కె.సూర్యనారాయణ లు పాల్గొనగా, కొత్తగూడెం హెడ్డాఫీసు నుండి డైరెక్టర్ (ఆపరేషన్స్ & పా) శ్రీ ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (ఫైనాన్స్ & పి&పి) శ్రీ ఎన్.బలరామ్ లు పాల్గొన్నారు. అన్ని ఏరియాల నుండి ఏరియా జనరల్ మేనేజర్లు ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.