మౌనగురు.. అకీరా.. శంకర !

296
Shankara – Looses its charm
- Advertisement -

తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘మౌనగురు’. హిందీలో ‘అకీరా’ పేరుతో రీమేక్‌ చేశారు. తెలుగులో ‘శంకర’గా తెరకెక్కింది. ’జ్యో అచ్యుతానంద’ సినిమాతో ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న మంచి హిట్ కొట్టేసిన నారా రోహిత్, ఎప్పట్నుంచో విడుదలకు నోచుకోకుండా ఉన్న ‘శంకర’ అనే సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరీ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :
ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు శంకర్(నారా రోహిత్). శంకర్‌కు తన అన్నయ్య చిన్నా(చిన్నా) నెల నెల డబ్బులు పంపిస్తే.. హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటూ ఉంటాడు. శంకర (నారా రోహిత్‌) బాధ్యత గల యువకుడు. సామాజిక స్పృహ ఎక్కువ. కళ్లెదుట అన్యాయం జరిగితే వూరుకోడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఓ ఏసీపీ (జాన్ విజయ్)కి సంబంధించిన అవినీతి వ్యవహారంలో చిక్కుకుంటాడు. ఈ గొడవలోనే చావు దాకా వెళ్ళొచ్చిన శంకర్‌కు ఆ తర్వాత సమాజంలో పిచ్చోడు, డ్రగ్స్‌కు బానిస అనే ముద్ర పడిపోయేలా ఏసీపీ కారణమవుతాడు. ముగ్గురు పోలీసులు శంకరని ఎన్‌కౌంటర్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అసలు శంకర్ ఎందుకు ఇబ్బందుల పాలయ్యాడు? దాన్నుంచి బయటపడేందుకు ఏమేం చేశాడు? తనపై పడ్డ డ్రగ్స్‌కు బానిసనే ముద్రను ఎలా పోగొట్టుకున్నాడు? అన్న ప్రశ్నలకు సమాధానమే సినిమా.

ప్లస్ పాయింట్స్ :
ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌. పోలీసులు ఓ తప్పును సరిదిద్దుకోవడానికి తప్పుమీద తప్పు చేయడం… ఈ వ్యవహారంలో ఓ సామాన్య యువకుడు ఇరుక్కొని అనుకోని ఇబ్బందుల్లో పడడం… అందులోంచి బయటకు వచ్చి, పోలీసులు చేసిన తప్పునకు తగిన శిక్ష పడేలా చేయడం.. ఇదీ కథ. రొటీన్‌ కథలు, ఫక్తు కమర్షియల్‌ సూత్రాలకు అనుగుణంగా నడిచే సినిమాల మధ్య ‘శంకర’ కాన్సెప్ట్‌ కొత్తగానే అనిపిస్తుంది. నారా రోహిత్ మరోసారి తన స్థాయికి తగ్గ నటనని ప్రదర్శించాడు. ఇటు కుర్రాడిగా సాదాసీదాగా కనిపిస్తూనే, అవసరమైనప్పుడల్లా యాంగ్రీ మ్యాన్‌గా మారిపోయి బాగా ఆకట్టుకున్నాడు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడా ఆకట్టుకునేలా ఉంది. రెజీనా మరోసారి పూర్తి స్థాయి డీ గ్లామర్ రోల్‌లో బాగానే చేసింది. విలన్‌గా జాన్ విజయ్ మంచి ప్రతిభనే కనబరిచాడు.

unnamed

మైనస్ పాయింట్స్ :
కాన్సెప్ట్‌ చుట్టూ అల్లుకొన్న కథనం, పాత్రల చిత్రణ ఇవన్నీ మూల కథకు మరింత బలాన్నిచ్చేలా లేకపోవడం అతి పెద్ద లోటు. దానికి తగ్గట్టుగా అదే స్థాయి స్క్రీన్‌ప్లే కానీ, కట్టిపడేసే సన్నివేశాలు కానీ లేకపోవడమే ఈ సినిమాకు మేజర్ మైనస్. హీరో ఇంట్రడక్షనే ఒక అర్థం లేని పాటతో మొదలుపెట్టడం అస్సలు బాలేదు. సినిమా స్లోగా మొదలవుతుంది. తొలి అరగంట.. విషయం ఉండదు. విడుదలకు చాలాకాలం నోచుకోని ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ తేలిపోవడంతో ఏదో 90ల్లోని సినిమాను థియేటర్లలో చూసిన ఫీలింగ్ కనిపించింది. క్లైమాక్స్‌లో యథావిధిగా కథానాయకుడు శత్రు సంహారం చేయడం సినిమాటిక్‌ ముగింపుగానే కనిపిస్తుంది. ఆ స్థానంలో కథానాయకుడు తన తెలివితేటలకు పదును పెట్టినట్టు చూపిస్తే… మరింత రక్తి కట్టేది.

సాంకేతిక విభాగం :
ముందుగా దర్శకుడు తాతినేని సత్య ప్రకాష్ గురించి మాట్లాడుకుంటే, ఒక సినిమాకు సరిపడా మంచి కథనే ఎంచుకున్న ఆయన, దాన్ని సినిమాగా మలచడంలో మాత్రం విఫలమయ్యాడు. ఎంతో ఇంటెన్సిటీతో సాగాల్సిన సినిమాను, సన్నివేశాలను, నిస్సారంగా నడిపి చాలాచోట్ల సాదాసీదా ప్రతిభ కూడా చూపలేకపోయాడు. ఓపెనింగ్ సీన్‌ను ఇంటర్వెల్ బ్యాంగ్‌కు కలిపిన విధానంలో మాత్రం దర్శకుడి పనితనం చూడొచ్చు. అంతకుమించి దర్శకుడిగా సత్య ప్రకాష్ చేసిందేమీ లేదు. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనేలా ఉంది. ఎడిటింగ్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. సాయికార్తీక్‌ నేపథ్య సంగీతం హారర్‌ సినిమాల్ని గుర్తుకు తెస్తుంది. పాటలూ గుర్తుపెట్టుకొనేలా లేవు. కథనంలో దర్శకుడు చేసిన లోటు పాట్లు… మూల కథను దెబ్బతీశాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.

Untitled-19 copy

తీర్పు :
చాలా కారణాల వల్ల శంకర సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఆ ప్రభావం అవుట్‌పుట్‌పై పడింది. రోహిత్‌, రెజీనాల లుక్‌ అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది. పైగా ఎప్పుడో మన మధ్యనుంచి వెళ్లిపోయిన నటులు ఎమ్మెస్‌, ఆహుతి… తెరపై దర్శనమిచ్చారు. దాన్ని బట్టి ఈ సినిమా ఎంతపాతదో అర్థమవుతుంది. దానితో పాటు టేకింగ్‌ కూడా ఆ పాత రోజుల్లోనే ఉండిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. శంకర, థియేటర్ల ముందుకు రావడం లేట్ అవ్వడం అటుంచితే, వచ్చి చేసేది కూడా ఏం ఉండదన్నది రిలీజ్ తర్వాతే తెలుసుకునే విషయం!

విడుదల తేదీ: 21/10/2016
రేటింగ్‌: 2.2 /5
నటీనటులు : నారా రోహిత్, రెజీనా..
సంగీతం : సాయి కార్తీక్
నిర్మాత : ఆర్.వీ.చంద్రమౌళి ప్రసాద్
దర్శకత్వం : తాతినేని సత్య ప్రకాష్

- Advertisement -