సమతామూర్తి విగ్రహం జ్ఞానానికి ప్రతీక- ప్రధాని మోదీ

72
- Advertisement -

శనివారం ప్రధాని మోదీ హైద్రబాద్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ.. అందరికీ వసంతపంచమి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజే రామానుజాచార్య విగ్రహావిష్కరణ జరిగిందని తెలిపారు. మనిషి జీవితంలో గురువు అత్యంత కీలకమని పేర్కొన్నారు. మనం గురువును దేవుడితో కొలుస్తామని, ఇది మన భారతదేశ గొప్పతనమని అన్నారు.

రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీక అని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయమన్నారు. రామానుజాచార్యుల విగ్రహం ఆయన ఆదర్శాలకు ప్రతీక అని, దేశ సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కూడా రామానుజాచార్యుల ప్రవచనాలనే చెప్పారని గుర్తు చేశారు.

‘మనిషి జీవితంలో గురువు అత్యంత కీలకం. గురువే ధ్యాన కేంద్రం. 108 దివ్య దేశ మందిరాలను ఇక్కడ చూశాను. దేశమంతా తిరిగి దేవాలయాలను చూసిన అనుభూతి కలిగింది. సమాజంలో అంతరాలను రామానుజాచార్య ఆనాడే తొలగించారు. అందరినీ సమానంగా చూశారు. ఆయన ఆదర్శాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. రామానుజాచార్యులు దళితులను ఆలయ ప్రవేశం చేయించారు. మనిషికి జాతి కాదు.. గుణం ముఖ్యమని లోకానికి చాటారు. రామానుజాచార్యుల సమతాసూత్రం మన రాజ్యాంగానికి స్ఫూర్తి.’ అని పేర్కొన్నారు.

సమాజంలోని అందరికీ సమాన అవకాశాలు దక్కాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అదరూ సమానంగా అభివృద్ధి చెందాలని అన్నారు. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఉజ్వల్‌ పథకం, జన్‌ధన్‌, స్వచ్ఛ్‌ భారత్‌ వంటి పథకాలన్నీ అందులో భాగమేనని తెలిపారు

‘దేశ ఏకతకు రామానుజాచార్యులు స్ఫూర్తి. దేశమంతటా రామానుజాచార్యులు పర్యటించారు. స్వాతంత్ర్య పోరాటం కేవలం దేశ ప్రజల అధికారం కోసమే కాదు. తెలుగు సంస్కృతి దేశ భిన్నత్వాన్ని బలోపేతం చేస్తోంది. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు తెలుగు సంస్కృతిని పోషించారు. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. పోచంపల్లికి ప్రంచ వారసత్వ గ్రామంగా ఘనత దక్కింది. తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైంది’ అని పేర్కొన్నారు.

అంతకుముందు చినజీయర్‌ స్వామి మాట్లాడుతూ.. శ్రీరాముడు వ్రత సంపన్నుడని కొనియాడారు. శ్రీరాముడిలా మోదీ కూడా గుణసంపన్నుడని ప్రశంసించారు. మోదీ ప్రధాని అయ్యాకే దేశ ప్రజలు హిందువులమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారన్నారు. మోదీ ప్రధాని అయ్యాక భరతమాత తలెత్తుకొని చిరునవ్వులు చిందస్తోందని పేర్కొన్నారు.

- Advertisement -