బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోమవారం ఉదయం జోధ్‌పూర్ న్యాయస్థానానికి చేరుకున్నారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో భాగంగా జోధ్‌పూర్ న్యాయస్థానం ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్‌పై బయటికి వచ్చిన సల్మాన్ స్థానిక సెషన్స్ కోర్టు తనకు విధించిన శిక్షను ఎత్తివేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీన్ని స్వీకరించిన సెషన్స్ కోర్టు విచారణను జులై 17కు వాయిదా వేసింది.
1998లో ‘హబ్ సాథ్ సాథ్ హై’ చిత్రం షూటింగ్ వేళ, సహ నటులు సైఫ్ అలీ ఖాన్, నీలమ్, టబు, సోనాలీ బెంద్రే, జోధ్ పూర్ వాసి దుష్యంత్ సింగ్ లతో కలసి వెళ్లి కృష్ణ జింక లను వేటాడినట్టు ఆరోపణలు రుజువైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏప్రిల్ 5న తీర్పునిస్తూ, సల్మాన్ కు 5 సంవత్సరాల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే.
ఆపై రెండు రోజుల్లో ఆయన బెయిల్ పై బయటకు రాగా, అదే కేసులో సల్మాన్ కు బెయిల్ ను నిరాకరిస్తూ దాఖలైన పిటిషన్ పై తన వంతు వివరణ ఇచ్చేందుకు సల్మాన్ ఖాన్ నేడు జోధ్ పూర్ కోర్టుకు చేరుకున్నారు. గత రాత్రి తన చెల్లెలు అల్విరా ఖాన్, స్నేహితుడు బాబా సిద్దిఖీతో కలసి జోధ్ పూర్ చేరుకున్నారు.