హుజురాబాద్‌లో ప్రచారానికి కొండా సురేఖ పనికిరాదా..?

22
konda

హుజురాబాద్ ఉప ఎన్నిక అక్కా తమ్ముళ్లా ఉండే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, కొండా సురేఖ మధ‌్య చిచ్చు పెట్టింది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తొలుత కొండా సురేఖను బరిలోకి దింపి టీఆర్ఎస్, బీజేపీకి చెక్ పెట్టాలని రేవంత్ భావించాడు. అసలు సురేఖకు పోటీ చేయడం ఇష్టం లేకపోయినా…రేవంత్ బలవంతం చేయడంతో ఒప్పుకుంది. కాని వరంగల్, పరకాల, భూపాలపల్లి టికెట్లు తన వర్గానికే ఇవ్వాలని కండీషన్లు పెట్టింది. అందుకు రేవంత్ ఒప్పుకోవడంతో హుజురాబాద్‌లో పోటీకి సురే‌ఖ ఒప్పుకుంది. కాని తన టీడీపీ మాజీ దోస్తు గండ్ర సత్యనారాయణను తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకున్న రేవంత్ భూపాలపల్లి సీటును ఆయనే కన్ఫర్మ్ చేయడంతో కొండా దంపతులు భగ్గుమన్నారు.

అంతే కాదు వరంగల్, పరకాల , హుజురాబాద్‌ సీట్లలో ఏదో ఒకటి మాత్రమే ఇస్తామంటూ రేవంత్ అధిష్టానం ముందు మాట మార్చడంతో సురేఖ సీరియస్ అయింది. రేవంత్ నమ్మించి మోసం చేయడంతో హుజురాబాద్‌లో పోటీ చేయనని అధిష్టానం పెద్దలకు ఖరాకండీగా చెప్పేసింది. దీంతో రేవంత్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఇబ్బంది లేకుండా బలమూరి వెంకట్ వంటి స్థానికేతరుడికి టికెట్ ఇచ్చాడు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో రేవంత్ రెడ్డికి ఇక ప్రచారానికి దిగక తప్పడం లేదు. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి వెంకట్ తరపున ప్రచారం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన్ల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , దామోదర రాజనర్సింహ, మధు యాష్కీ, మహేశ్వర్ రెడ్డి, వీహెచ్ , పొన్నాల, అజారుద్దీన్, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, సీతక్క, డీసీసీ అధ్యక్షులు కవ్వం పల్లి సత్యనారాయణ, నాయిని రాజేందర్‌లు ఉన్నారు. కాగా వరంగల్ జిల్లాకు ఆనుకుని ఉండే హుజురాబాద్‌లో కొండా దంపతులకు స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌లో చోటు దక్కకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

హుజురాబాద్‌లో బీసీల ఓట్లు కీలకంగా ఉన్న తరుణంలో కొండా దంపతులు ఎంట్రీ ఇస్తే పద్మశాలీ, మున్నూరుకాపుల ఓట్లతో పాటు బీసీల ఓట్లు బాగా చీలుతాయని, అదే జరిగితే ఈటల గెలుపు అవకాశాలకు గండి పడుతుందనే భావనతోనే రేవంత్ కొండా సురేఖకు స్టార్ క్యాంపెయినర్‌గా ఛాన్స్ ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు టికెట్ విషయంలో తనకు, కొండా దంపతులకు మనస్పర్థలు రావడంతో రేవంత్ కావాలనే సురేఖను పక్కనపెట్టాడని హస్తం వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే హుజురాబాద్‌కు ఏ మాత్రం సంబంధం లేని సీతక్క ప్రచారం చేయంగా లేనిది..లోకల్‌గా సత్సంబంధాలు ఉన్న తాను క్యాంపెయిన్‌కు పనికిరానా అంటూ సురేఖ రేవంత్ తీరుపై రుసరుసలాడుతుందంట. తమ నేతను రేవంత్ రెడ్డి మరోసారి ఘోరంగా అవమానించాడని కొండా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట.ప్రస్తుతం పీసీసీ క్యాంపెయిన్ల లిస్ట్‌లో కొండా సురేఖకు చోటు కల్పించకపోవడం గాంధీభవన్‌లో చర్చనీయాశంంగా మారింది.