భట్టి విక్రమార్కకు మంత్రి పువ్వాడ స్ట్రాంగ్ కౌంటర్..!

203
batti vikramarka
- Advertisement -

తెలంగాణలో చచ్చిపోతున్న కాంగ్రెస్ పార్టీని బతికించడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. పీసీసీ ప్రెసిడెంట్ పదవి కొట్టేసేందుకు కాంగ్రెస్ నేతలు ఒకరిని మించి ఒకరు పాదయాత్రలు చేస్తూ తెగ ఫీట్లు చేస్తున్నారు. ఓ పక్క రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి అడ్డుపెడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలకు చెక్ పెట్టేందుకు అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తూ హడావుడి చేస్తుంటే..మేమేం తక్కువ అన్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..కూడా కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ.. అదిలాబాద్ నుంచి పొలం బాట పేరుతో రైతు యాత్ర చేపట్టారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నేతల విమర్శలపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నిప్పులు చెరిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో రూ.3.75 కోట్లతో నిర్మించనున్న టీఎస్‌ ఆర్టీసీ శాటిలైట్‌ బస్‌ డిపోకు పువ్వాడ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కాంగ్రెస్ నేతల విమర్శలపై మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చుక్క నీరు ఇవ్వకుండా గోదావరిలో 7 మండలాలను ముంచి దుమ్ముగూడెం, రాజీవ్‌ సాగర్‌ పేరిట వందల కోట్లు మింగిన కాంగ్రెస్‌ నాయకులకు సీఎం కేసీఆర్‌ను విమర్శించే ఆర్హత లేదని పువ్వాడ గరం గరం అయ్యారు.

సీఎం కేసీఆర్‌కు కనీస గౌరవం ఇవ్వకుండా నోరు పారేసుకుంటున్న కాంగ్రెస్ దద్దమ్మలు తమ పాలనలో తెలంగాణాకు ఏం ఒరగబెట్టారో చెప్పాలంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 30 లక్షల ఏకరాలకు నిరంతరం విద్యుత్తుతో సాగునీరందిస్తూ మొత్తంగా కోటి ఏకరాలు సాగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. సీఎం కేసీఆర్‌పై మీ అడ్డగోలు విమర్శలపై మా రక్తం మరుగుతోంది. మీ విమర్శలను ప్రజలు సహించరు బిడ్డా’’ అంటూ భట్టిపై పువ్వాడ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. స్థాయిని మించి విమర్శలు చేస్తే కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు. మొత్తంగా సీఎం కేసీఆర్‌పై చేస్తున్న విమర్శలకు భట్టి విక్రమార్కతో సహా కాంగ్రెస్ నేతలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఉతికారేశారు.

- Advertisement -