మరికొద్ది గంటల్లో ప్రారంభం కావాల్సిన భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే రెండో వన్డేపై నీలినీడలు కమ్ముకొన్నాయి. పిచ్‌ను బుకీలకు అమ్మేస్తూ.. అడ్డంగా దొరికిపోయాడు ఎంసీఏ (మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్) క్యూరేటర్. దీంతో ఈ రోజు మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.
అయితే, పిచ్ కుంభకోణానికి పాల్పడిన క్యూరేటర్‌ను వెంటనే సస్పెండ్ చేస్తామని, మ్యాచ్ రద్దు చేయలా? లేక కొనసాగించాలా? అన్నది రిఫరీ నిర్ణయం తీసుకుంటారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
వివరాల్లోకి వెళ్తే.. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎమ్‌సీఏ) మైదానం వేదికగా నేటి మధ్నాహం 1.30గంటలకు భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే ప్రారంభంకావాల్సి ఉంది. అయితే పిచ్ క్యూరేటర్ పాండురంగ్ సాల్‌గావ్కర్ బుకీలతో చేతులు కలిపి.. పిచ్‌కు సంబంధించిన రిపోర్టు మొత్తం వారి చేతుల్లో పెట్టాడు. ఓ టెలివిజన్ ఛానెల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో మ్యాచ్ ప్రారంభానికి కొద్దిగంటల ముందు ఈ విషయం బయటకు పొక్కింది.
విషయం తెలుసుకున్న బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా మాట్లాడుతూ, క్యూరేటర్ పై కఠిన చర్యలుంటాయని అన్నారు. విషయాన్ని తాము విచారిస్తున్నామని, ఇప్పుడే నిర్ణయం చెప్పమనడం సరికాదని అన్నారు. ఎటువంటి ఫిక్సింగ్, లంచాలను బీసీసీఐ సహించబోదని ఆయన స్పష్టం చేశారు.
పేరును వెల్లడించేందుకు ఇష్టపడని మరో బీసీసీఐ అధికారి స్పందిస్తూ, క్రికెట్ నియమ నిబంధనల గురించి ప్రతి అధికారికి, ఉద్యోగికీ తెలుసునని, డబ్బుకోసం ఇలా చేయడం గర్హనీయమని అన్నారు. క్యూరేటర్ పైనా, పుణె స్టేడియం అధికారులు, ఇతరులను పిచ్ మీదకు అనుమతించిన ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాల్సిందేనని మాజీ కెప్టెన్ అజారుద్దీన్ డిమాండ్ చేశారు.