ఓ వైపు ఎమ్మెల్యేలు మరోవైపు సీనియర్ నేతలు ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెప్పి తమ దారి తాము చూసుకుంటుండటంతో ఢీలా పడ్డ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మనోధైర్యం నింపేందుకు సిద్ధమైంది హైకమాండ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన సీట్లు రాకపోవడంతో లోక్ సభ ఎన్నికల్లోనైనా మెరుగైన ఫలితాలు సాధించే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం రాహుల్‌తో పాటు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీతో ప్రచారం చేయించేందుకు సిద్ధమవుతున్నారు హస్తం నేతలు.
స్థానిక నేతల ప్రచారం సంగతి ఎలా ఉన్నా.. జాతీయస్థాయి స్టార్స్‌తో క్యాంపెయిన్ చేయించడం ద్వారా పార్టీకి కలిసివస్తుందని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా దూసుకు పోతున్న ప్రియాంక గాంధీని తెలంగాణ పల్లెల్లో ప్రచారం చేయించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రియాంకతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించడం ద్వారా పల్లెల్లో సెంటిమెంట్ ఓట్లను రాబట్టేందుకు స్కెచ్ వేస్తున్నారు .
దీనికి తోడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లతో విడి విడిగా బహిరంగ సభలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ముందుగా రాహుల్ గాంధీతో మూడు బహిరంగ సభలను ఏర్పాటు చేసేలా ప్లాన్ వేస్తున్నారు. తర్వాత ప్రియాంక బహిరంగసభలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా వెంటిలెటర్‌పై ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌కు రాహుల్,ప్రియాంక ప్రచారం ఊపిరిపోస్తుందా లేదా చేచిచూడాలి.