భారతీయ రిజర్వు బ్యాంకు దేశ ప్రజలకు శుభవార్త అందించనుంది. దేశంలో నోట్ల రద్దు వల్ల ఏర్పడిన కరెన్సీ కొరత, చిల్లర సమస్యను అధిగమించేందుకు వీలుగా కొత్తగా అడ్వాన్సు హై సెక్యూరిటీ ఫీచర్లతో రూ.200నోటును ముద్రిస్తోంది. గత సంవత్సరం నవంబర్ లో రూ.1000, రూ.500 నోట్లని రద్దు చేసి కొత్తగా రూ.2000, రూ.500 నోట్లని ప్రవేశపెట్టింది రిజర్వు బ్యాంకు. దీంతో అప్పటినుంచి ప్రజలకు నోట్ల కష్టాలు మొదలయ్యాయి.
వెయ్యి నోటుని రద్దు చేసి రెండు వేల నోటుని ప్రవేశపెట్టడంతో చిల్లర సమస్య ఎక్కువైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరి ఎక్కువగా ఉండటంతో ప్రజలు చిల్లర దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో చిల్లర కొరతని తీర్చేందుకు కొత్తగా రెండు వందల రూపాయల నోట్లను చలామణిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది ఆర్బీఐ.
గతనెలలో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. నోట్ల చెలామణిలో పలుమార్పులు కూడా తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రస్తుతం ఉన్న కాగితం నోటుస్థానంలో చాలాకాలం మన్నికగా ఉండే ప్లాస్టిక్ నోట్లు తీసుకురావాలని ఆర్బీఐ భావిస్తోంది.
మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లో ఉన్న ప్రభుత్వ ముద్రణశాలకు కొంతకాలం క్రితమే ఈ నోట్ల ముద్రణ మాధ్యతను అప్పగించారు. నకిలీవి సృష్టించడానికి వీల్లేని విధంగా రూ.200 నోట్లలో అదనపు భద్రత ప్రమాణాలు చేర్చారు. రూ.100, రూ.500 మధ్య ఇలాంటి నోటు రావడం వల్ల రోజువారీ నగదు పనులు సులభమవుతాయని బ్యాంకుల అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు.