ఉద్యోగులకు కేసీఆర్ వరాలు..రెండు రోజుల్లో పీఆర్సీ

245
cm kcr
- Advertisement -

తెలంగాణ పునర్‌ నిర్మాణంలో ఉద్యోగుల పాత్ర కీలకమని….రాష్ట్రం మరింత పురోగమించే దిశగా ఉద్యోగులు కృషిచేయాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్.ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. గత సంవత్సరం నీటిపారుదల రంగంలో 25 వేల కోట్లు ఖర్చు చేశామని…ఉద్యోగుల సహకారంతో ప్రాజెక్టుల్లో పురోగతి ఉందన్నారు. కమిట్‌మెంట్‌తో పనిచేసే ఉద్యోగులు ఉండటం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ నెంబర్‌ 1గా నిలిచిందన్నారు. సంక్షేమం,అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఉద్యోగులది కీలకపాత్ర అన్నారు.రెవెన్యూ వసూళ్లలో తెలంగాణ దేశంలో అందరికి ఆదర్శంగా నిలిచిందన్నారు.

రైతు బంధు పథకం కోసం ఉద్యోగులు సెలవులను కూడా త్యాగం చేశారని…బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్న వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉందన్నారు. టీచర్స్‌ కూడా ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన ఫలితాలు తెచ్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.

కొత్తరాష్ట్రమైన తెలంగాణ అద్భుత ఫలితాలను సాధిస్తుందంటే అది ఉద్యోగుల కృషి వల్లే సాధ్యమైందన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నామంటే ఉద్యోగుల ఎనలేని కృషి ఉందన్నారు. ఈటెల రాజేందర్ అద్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదక ఆధారంగ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.

పీఆర్సీ అపాయింట్ మెంట్ రెండు మూడు రోజుల్లో ఇస్తామని చెప్పారు సీఎం. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ వేస్తున్నామని చెప్పారు. జూన్ 2న ఉద్యోగులకు శుభవార్త అందిస్తామని చెప్పారు. ఉద్యోగుల బదిలీలపై సానుకూలంగా ఉన్నామని చెప్పారు. పారదర్శకంగా అవినీతి లేకుండా ఉద్యోగుల బదిలీలు ఉండేందుకు అజయ్ మిశ్రా నేతృత్వంలో కమిటీ వేశామని తెలిపారు.ఉద్యోగుల బదిలీల్లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ బదిలీ విధానం వచ్చే వరకు కేబినెట్ సబ్ కమిటీ ఉంటుందన్నారు.

పోలీసుల సమస్యలను డీజీపీ మహేందర్ రెడ్డి కేబినెట్‌ సబ్ కమిటీకి ఇచ్చారని తెలిపారు. ఉద్యోగులైన‌ భార్య,భర్తలిద్ద‌రూ ఒకేచోట ప‌నిచేసేవిధంవగా కృషి చేస్తామన్నారు. ఉద్యోగులకు రావాల్సిన డీఏను వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. తెలంగాణ జోనల్ విధానంపై ఉద్యోగ సంఘాలతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలకు సంబంధించిన ఉపాధ్యాయుల కోసం సమగ్ర పాలసీ తీసుకొస్తామని చెప్పారు.

ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసుల కోసం ప్రభుత్వమే న్యాయ పోరాటం చేస్తుందన్నారు.లీవ్ ట్రావెల్ కన్‌సెషన్‌(ఎల్‌టీసీ) కోసం పాలసీని రూపొందించి అలవెన్స్‌ ప్రతి ఉద్యోగికి సౌకర్యం కల్పిస్తామన్నారు. కొన్నిప్రాంతాలకు ఉద్యోగులు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదని అలాంటి జిల్లాలకు ప్రత్యేక అలవెన్స్ ఇచ్చేవిధంగా కృషిచేస్తామన్నారు. ఉద్యోగంలో ఉంటూ మరణించే వారి కుటుంబాల్లో ఒకరికి పది రోజుల్లో ఉద్యోగం ఇచ్చే విధంగా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

భాష పండితులు,పీఈటీల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఉద్యోగుల హెల్త్ స్కీం పకడ్బందీగా ఉండే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఉద్యోగుల రిటైర్‌మెంట్ ఖర్చును ప్రభుత్వమే బరిస్తుందన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు 5 రోజులు కావాలని కోరారని వాటిని అమోదించినట్లు తెలిపారు. రైతుబంధు స్కీంలో భాగంగా గెజిటెడ్ ఆఫీసర్స్ త‌మ భూముల‌కు సంబంధించిన పెట్టుబడిని ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు తెలిపారని చెప్పారు.

- Advertisement -