గుంటూరులో నిర్వహించిన బీజేపీ ప్రజా చైతన్య సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు తప్పుడు మాటలను కాదని రాష్ట్ర ప్రజలు భారీ సంఖ్యలో గుంటూరు సభకు వచ్చారని మోదీ తెలిపారు. ఏపీలో తండ్రీకొడుకుల (చంద్రబాబు-లోకేశ్) అవినీతి ప్రభుత్వం పోవాల్సిన సమయం ఆసన్నమయిందని వ్యాఖ్యానించారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని మోదీ అన్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అవినీతి రహిత ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..‘‘నా కంటే సీనియర్ అని చంద్రబాబు చెప్పుకుంటారు. అవును, కొత్త కూటములు జత కట్టడంలో మీరు సీనియర్. ఎన్నికల్లో ఓడిపోవడంలో మీరు సీనియర్. ఏపీ ప్రజల కలలను నీరుగార్చడంలో మీరు సీనియర్. ఆ విషయంలో నేను ఆయనతో పోటీ పడలేను’’ అంటూ ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుపై వ్యంగ్య బాణాలను సంధించారు.
ఏ పార్టీ అయితే రాష్ట్రాన్ని మోసం చేసిందో ఆ పార్టీతోనే జట్టు కట్టారంటూ విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ద్వారా వచ్చే నిధుల కంటే ఎక్కువే ఇచ్చామని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. కేంద్ర పథకం హృదయ్ కింద అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని, వేల కోట్ల రూపాయల విలువైన పథకాలు, ప్రాజెక్టులు ప్రారంభించామని ప్రధాని మోదీ వెల్లడించారు.