మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-సమంత కాంబినేషన్‌లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. విడుదలైన తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న రంగస్థలం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటివరకు రూ.150 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం ఓవర్సిస్‌లోనూ సత్తా చాటుతోంది. తాజాగా హైదరాబాద్‌లో రంగస్థలం విజయోత్సవం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..చిత్ర యూనిట్‌పై ప్రశంసలు గుప్పించారు. రంగస్థలం సినిమా ఆస్కార్‌కు వెళ్లాలని ఆకాంక్షించారు. మన తెలుగు కథ, మన మట్టికథ. మన జీవితాల కథ. ఈ కథలో మన పౌరుషాలు, మన పట్టింపులు, మన గొడవలే ఉంటాయి. ఇలాంటి మంచి సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావాలన్నారు. అందుకే ఆస్కార్‌కి వెళ్లాలన్నారు. బాహుబలి తర్వాత తెలుగు వారు గర్వపడేలా అంతా చూడదగ్గ సినిమాగా అనిపించిందన్నారు.
చిట్టిబాబు నా తమ్ముడు.. నా అన్నయ్య, నాకు తండ్రి.. నా వదిన నాకు అమ్మ అంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. రామ్ చరణ్ విజయాన్ని చూసి పొంగిపోడు. అపజయం వస్తే కుంగిపోడు. అందుకే ఎప్పటికి నచ్చుతాడని..చరణ్ చిన్నప్పటి నుండి ఏదోటి నేర్చుకోవాలను తపన ఉన్నవాడు. నేను ముసుగు తన్ని పడుకుంటే వీడు హార్స్ రైడింగ్ నేర్చుకునే వాడు. రామ్ చరణ్ సంపూర్ణ నటుడు. నేను ఇలాంటి చిత్రాలు చేయాలని ఉన్నా అలా నటించలేను. చరణ్ ఇలాంటి పాత్రలు మరెన్నో చేయాలని కోరకుంటున్నానని తెలిపారు పవన్.
ఎంతో దూరం నుండి ఇక్కడి వచ్చిన మా సోదర అభిమానులకు ధన్యవాదాలు. రంగస్థలం సినిమాలో చాలా మంది నటులు నటించారు ఇంత మందిని ఒకే ఫ్రేమ్ పెట్టడం చాలా కష్టం. ఈ చిత్రం మరికొన్ని రికార్డులు బద్దలు కొట్టాలన్నారు. ఇలాంటి సినిమా తీసిను సుకుమార్‌కు మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నానిన తెలిపారు.
నేను సినిమాలు తీస్తా కాని.. పూర్తిగా చూసింది లేదు. నా సినిమాలు నేను చూసుకోను. ఎప్పుడో ‘తొలిప్రేమ’ చిత్రం హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో చూశా. అది కూడా సగమే చూశా. కాని ఇన్నేళ్ల తరువాత ‘రంగస్థలం’ చిత్రాన్ని థియేటర్‌కి వెళ్లి మరీ చూశా అన్నారు.
రంగస్థలం చూస్తున్నప్పుడు అది నాకు సినిమాలా అనిపించలేదు. ‘రంగస్థలం’ అనే ఊరికి వెళ్లొచ్చినట్టు అనిపించిందని తెలిపారు పవన్. రంగస్థలం ఒక జీవితంలా అనిపించింది. బావితరాలకు వాస్తవికతను అందించింది. ఇది చాలా మందికి స్పూర్తిదాయకమని తెలిపారు. భవిష్యత్‌లో సుకుమార్‌ను స్పూర్తిగా తీసుకుని మరింత మంది దర్శకులు ముందుకువస్తారని తెలిపారు.
దర్శకుడు సుకుమార్‌తో సినిమాతో అవకాశం నాకు లభించలేదు. కాని ఆయన నాకు అప్పట్లో కథ చెప్పారు. తరువాత చేద్దాంలే అన్నా. అలా ఆయనతో సినిమా చేసే అవకాశాన్ని నేను మిస్ అయ్యా. యువతకు ఏం కావాలో తెలిసిన దర్శకుడు సుకుమార్ అని తెలిపారు.