పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ నగరంలో పార్కులపై జిహెచ్ఎంసి ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా వివిధ రకాల పార్కులను అభివృద్ది చేస్తున్నది. దోమలగూడలోని ఇందిరా పార్కు నందు ఒక ఎకరం విస్తీర్ణంలో పంచతత్వ ఆక్యూప్రెజర్ వాకింగ్ ట్రాక్ పార్కును అభివృద్ది చేశారు.
ఆక్యూప్రెజర్ (శరీరంపై ఒత్తిడి కలిగించు) పద్దతిలో ఎనిమిది అంశాలతో ఈ పార్కును నిర్మిస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో సర్కిల్ పద్దతిలో ట్రాక్ పై నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలో ఉన్న నరాలపై వివిధ స్థాయిలో ఒత్తిడిని కలిగించే పద్దతిలో 20 ఎం.ఎం, 10 ఎం.ఎం రాళ్లు, రివర్ స్టోన్స్, 6 ఎం.ఎం చిప్స్, ఇసుక, చెట్ల బెరడు, నల్లరేగడి మట్టి, నీటి బ్లాక్‌లను విడివిడిగా అనుసంధానం చేస్తూ వాకింట్ ట్రాక్‌ను నిర్మించారు. ఈ సర్కిల్‌కు అన్ని వైపులా 40 రకాల మెడిసినల్, హెర్బల్ ప్లాంట్స్‌ను బ్లాక్‌లుగా ఏర్పాటు చేశారు. మొదటగా నరాలపై అధిక ఒత్తిడి కలిగించే ట్రాక్ నుండి క్రమ పద్దతిలో ఒత్తిడి తగ్గించే ట్రాక్ వైపు నడవటం వల్ల రక్తప్రసరణలో సానుకూల మార్పు జరిగి వివిధ రకాల అనారోగ్యాలు దూరమవుతాయి. ఈ పార్కు మధ్యలో గౌతమ బుద్దుడి విగ్రహాన్ని నెలకోల్పారు.
ఆరోగ్యపరంగా వున్న ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకుని, ఆరోగ్యo పట్ల నగర ప్రజలలో పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని అన్ని జోన్లలో పంచతత్వ పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్ తెలిపారు.