ఈ వారం ఓటీటీల్లో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే.. సినీ ప్రియుల్ని అలరించేందుకు ఈవారం చిత్రాలు సిద్ధమైపోయాయి. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా తొలిసారి డిజిటిల్ అరంగేట్రం చేస్తుండగా, మలయాళ నటి అన్నా బెన్ మరోసారి కొత్త కథాంశంతో ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. విజయ్‌సేతుపతి ఓ తమిళ అనువాదం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఆ సినిమాలు ఏంటి? ఏ రోజున విడుదల అవుతున్నాయో చూద్దాం.
తమిళంలో 2018లో విడుదలైన ‘జుంగా’ తెలుగులో ‘విక్రమార్కుడు’గా అనువాదమైంది. సాయేషా, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని గోకుల్ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి ఇందులో డాన్‌గా కొత్తగా కనిపిస్తున్నాడు. యోగిబాబు ఓ కీలక పాత్ర పోషించారు. యాక్షన్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ‘విక్రమార్కుడు’ మూవీ జులై 9న తెలుగు ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమ్ కానుంది.
పునర్నవి భూపాలం కీలక పాత్రలో సంజయ్ వర్మ, గరిమా హీరోహీరోయిన్లుగా నటించిన థ్రిల్లర్ మూవీ ‘ఒక చిన్న విరామం’. ఈ శుక్రవారం(జులై 9) నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది. బిజినెస్ మ్యాన్ అయిన దీపక్ లాభాలు సాధించాలని తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే కథాంశంతో తెరకెక్కింది. 2020లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల కోసం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
అన్నాబెన్ నటించిన మలయాళ చిత్రం ‘సారాస్’. అమెజాన్ ప్రైమ్‌లో ఇవాళే(జులై 5) విడుదలైందీ సినిమా. జూడ్ ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించారు. ‘కుంబలాంగి నైట్స్’ సినిమాతో అరంగేట్రం చేసి ‘కప్పెలా’, ‘హెలెన్’ లాంటి హిట్లతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో అన్నాబెన్ నటించిన ‘సారాస్’పై అంచనాలు పెరిగాయి. ఇందులో ఆమె అసోసియేట్ డైరెక్టర్‌గా కనిపించనుంది. పెళ్లి, పిల్లలు అంటే ఇష్టం ఉండని యువతి. ఎప్పటికైనా మెగాఫోన్ పట్టి సినిమా తీయాలనేది ఆమె కల. మరి ఆ కలను సారా నెరవేర్చుకుందా? ఈ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది తెలియాలంటే ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా డిజిటల్ అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్’. గుజరాత్‌లోని అక్షర్‌ధామ్ దేవాలయంపై జరిగిన తీవ్రవాదుల దాడి ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో అక్షయ్ ఖన్నా ఎన్ఎస్‌జీ కమాండర్ హనుత్ సింగ్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం జీ5 ఓటీటీలో జులై 9న విడుదల అవుతుంది.