అమ్మ మృతిపై సిట్టింగ్‌జడ్జితో విచారణ

236
OPS claims CMs post
- Advertisement -

తమిళనాట రాజకీయాలు గంటగంటకు మలుపు తిరుగుతున్నాయి. ఓ వైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ప్రధానకార్యదర్శి శశికళ మంతనాలు జరుపుతుండగానే మరోవైపు ఆపధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బాంబు పేల్చారు. అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని ప్రకటించారు. శాసనసభ జరిగితే తనకు మద్దతిచ్చే వారిసంఖ్య పెరుగుతుందని స్పష్టం చేశారు. తానేంటో కొన్ని గంటల్లోనే చూపిస్తానని శశికళకు సవాల్ విసిరారు.

ఇప్పటివరకు తాను నోరు విప్పింది కేవలం పది శాతమేనని, ఇంకా 90 శాతం మిగిలే ఉందని అన్నారు. అవన్నీ తనతో చెప్పించే ప్రయత్నం చేయొద్దని అవతలి పక్షాన్ని హెచ్చరించారు.  తాను ప్రతిపక్షాలతో కుమ్మక్కయ్యానని వాళ్లు ఆరోపించడం సహజమేనని అన్నారు. తిరుగుబాటు చేసినప్పుడు ఎవరిమీదైనా ఇలాగే బురద చల్లుతారన్నారు. తాను ప్రతిరోజూ అపోలో ఆస్పత్రికి వెళ్లానని, కానీ అమ్మను ఆస్పత్రిలో ఒక్కసారి కూడా చూసే అవకాశం తనకు రాలేదని, అమ్మను ఆస్పత్రిలో చూడలేని దురదృష్టవంతుడినని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే పార్టీకి, జయలలితకు నిజమైన విశ్వాసపాత్రుడిని తానేనని పన్నీర్ సెల్వం చెప్పారు.

తానెప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదని… పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని.. మాట్లాడబోమని పన్నీర్‌సెల్వం స్పష్టం చేశారు. షీలా బాలకృష్ణన్ రాజీనామా గురించి ఇప్పుడేమీ చెప్పలేనని, ఆమెకు ఇప్పటికే ఎక్స్‌టెన్షన్ ఇచ్చామని అన్నారు. తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్న ప్రతి పరిణామం వెనుక ఒక శక్తి ఉందని చెప్పారు. తాను ఎంజీఆర్‌.. జయలలిత తమిళనాడుకు ఎంతో సేవ చేశారని.. వారి బాటలోనే తానూ నడుస్తానన్నారు. శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి మాత్రమేనని.. త్వరలోనే ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ శాశ్వత ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటామని పన్నీర్‌ సెల్వం తెలిపారు.

గవర్నర్‌ చెన్నై వస్తే నేరుగా కలిసి ప్రస్తుత పరిస్థితిని వివరిస్తానన్నారు. తమిళనాడు వ్యాప్తంగా పర్యటించి అన్ని వర్గాల మద్దతు తీసుకుంటానన్నారు. పన్నీర్‌ సెల్వం ఆరోపణలతో కంగుతిన్న శశికళ నిన్న ఆయన్ని పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించారు.

- Advertisement -