ఎన్టీఆర్ బయోపిక్…మూడు ముక్కలాట

172
One more film on NTR
- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్…ప్రస్తుతం ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు పొలిటికల్ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను తెరమీద ఆవిష్కరించేందుకు దర్శకులు పోటీ పడుతున్నారు. తొలుత ఎన్టీఆర్ తనయుడు,ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపగా…తర్వాత వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ సైతం ఓ సినిమా తీస్తున్నట్లు ప్రకటించి అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకున్నారు. తాజాగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కబోతోంది. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ మూడు ముక్కలాటగా మారింది.

బాలయ్య హీరోగా తెరకెక్కనున్న చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాతో బాలకృష్ణ నిర్మాతగా మారనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు అంతా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమా ద్వారా తనయుడు మోక్షజ్ఞ  గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్దం చేస్తున్నారు బాలయ్య.  ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో ఏఎన్నాఆర్  కీలకంగా ఉండటంతో ఆ పాత్రలో  నాగార్జున నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. మరో కీలకపాత్రలో జూనియర్ ఎన్టీఆర్‌  సైతం నటించే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం. వచ్చే సంవత్సరం ఎన్టీఆర్ జయంతి రోజున సినిమాను విడుదల చేసేందుకు తేజ కసరత్తు చేస్తున్నారు.

ఎన్టీఆర్ జీవిత చరిత్రపై మూడు సినిమాలు వస్తున్న అందరి దృష్టి మాత్రం రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించే చిత్రంపైనే ఉంది. ఎన్టీఆర్ శత్రువులు ఎవరు, కుట్రలు చేసింది ఎవరు, కుట్రల వెనకున్న సలు రహస్యం ఏంటో చూపిస్తానని వర్మ ప్రకటించడంతో కొందరి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ సినిమాకు  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ   టైటిల్‌ ఖరారు చేసిన వర్మ  వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించి అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

వర్మ తీయనున్న ఎన్టీఆర్‌ సినిమాకి వైసీపీ నేత రాకేష్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో  ఆ పార్టీకి అనుకూలంగా ఉండనుందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమా మొదలు కాకముందే టీడీపీ నేతలు వర్మపై ఎదురుదాడికి దిగుతుండటంతో మరింత ఆసక్తిని రేపుతోంది.  ఈ నేపథ్యంలో  కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి  తెరకెక్కించే సినిమా టీడీపీకి అనుకూలంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమాకు‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అంటూ టైటిల్ ప్రకటించడంతోనే తాను తీయబోయే సినిమా ఎవరికి అనుకూలంగా ఉండనుందో పరోక్షంగా చెప్పేశాడు కేతిరెడ్డి.

మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్‌ మూవీపై.. సినీ, రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. తెలుగుచలనచిత్ర రంగంలో ప్రముఖహీరోగా.. ప్రజానేతగా మన్ననలు అందుకున్నారు నందమూరి తారకరామారావు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడన్న యశస్సును పొందారు. ఆ ఆదరణే ఆయన్ను రాజకీయాల్లోనూ హీరోగా నిలబెట్టింది. సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అయితే ఉహించని విధంగా ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంట్రీ…. 1995 ఆగస్టు సంక్షోభంతో పార్టీలో తిరుగుబాటు,1996 జనవరిలో గుండెపోటుతో మరణం..ఈ అంశాలన్నీ తెర ఎలా చూపించబోతున్నారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.  మరి ఈ మూడు ముక్కలాటలో ఎవరు ప్రజల దృష్టిని ఆకర్షించి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తారో వేచిచూడాల్సిందే.

- Advertisement -