వెరిఫికేషన్ లేకుండానే పాస్‌పోర్ట్!

215
Now, passport sans police verification
- Advertisement -

విదేశాలకి వెళ్ళాలంటే ఖచ్చితంగా పాస్ పోర్ట్ కావాలి, ఇంతకు ముందు పాస్ పోర్ట్ రావాలంటే డాక్యుమెంట్స్ అని, పోలీస్ వెరిఫికేషన్ అని చాలా  సమయం పట్టేది, అప్లై చేసిన 2,3 నెలలకి గాని వచ్చేది కాదు, ఇంకా పోలీస్ వెరిఫికేషన్ అని వచ్చేవాళ్ళకి 1000/- నుండి 3000/- వరకు లంచం ఇవ్వాల్సి వచ్చేది, ఇప్పుడు ఇలాంటి కష్టం ఏమి లేకుండా అప్లై చేసిన 10 రోజులలోనే పాస్ పోర్ట్ ని పొందవచ్చు.

ఆధార్ కార్డు ఉంటే 10 రోజుల్లో పాస్‌పోర్టు మీ చేతిలో ఉంటుంది. ఆధార్ కార్డు సమాచారాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో అనుసంధానం చేశారు.ఈ రోజులలో పాస్‌పోర్టుల జారీ విషయంలో పోలీసు వెరిఫికేషన్ అనేది చాలా ఆలస్యం అవుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

నేరాలు, నేరగాళ్ల వివరాలు, సిస్టమ్స్‌ ప్రాజెక్టుకు పాస్‌పోర్టు సేవలను అనుసంధానం చేయడం ద్వారా దరఖాస్తుదారుల బయోడేటా వెంటనే తెలిసిపోతుంది. ఏడాదిలోగా ఇది అమల్లోకి వస్తుందని భావిస్తున్నామని కేంద్ర హోం శాఖ అధికారి రాజీవ్‌ మెహరిషి వెల్లడించారు.అంతేకాదు ఇకపై దేశంలోని ఏ మారుమూల ప్రాంతంలో ఏ నేరం జరిగినా నేరస్థులు ఎక్కడికీ తప్పించుకోలేరు…. నేరాలు, నేరగాళ్ల ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌, సిస్టమ్స్‌ ప్రాజెక్టు (సీసీటీఎన్‌ఎస్‌) కింద అన్ని రాష్ట్రాల క్రైమ్‌ రికార్డులను కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఉంచింది.

దీనికోసం ఇప్పటికే దేశంలోని 15,398 పోలీసు స్టేషన్లకు గాను 13,775 స్టేషన్ల వివరాలను ‘డిజిటల్‌ పోలీసు పోర్టల్‌’లో కేంద్రం అప్‌లోడ్‌ చేసింది. ఈ పోర్టల్‌ను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోర్టల్‌లోని వివరాలు అన్ని రాష్ట్రాల పోలీసులతోపాటు, కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. 2018 మార్చిలోపు అన్ని పోలీసు స్టేషన్ల రికార్డులను ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -