సంచార కులాలను బీసీల్లో చేర్చడంపై పరిశీలిస్తాం -కేసీఆర్‌

227
- Advertisement -

స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరినుంచి ఇప్పటి వరకు గుర్తించని 30 బీసీ కులాలలోని సంచార జాతులను గుర్తించి వారిని బీసీ కులాల్లో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీ శంకర్ రాసిన బీసీ కులాలు-సంచార జాతులు అనే పుస్తకాన్ని హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సంచారజాతులకు చెందిన 30 కులాలను బీసీ కులాల జాబితాలో చేర్చవలసి వుందని బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరిశంకర్ ముఖ్యమంత్రి దృష్టికి తేగా, వెంటనే సీఎం స్పందించి సంచార జాతులను బీసీ కులాల్లో చేర్చే విషయంపై అధ్యయనం చేయాలని రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిలకు బాధ్యతలు అప్పగించారు. బీసీ కులాల్లో సంచారజాతులకు సంబంధించిన అధ్యయనాన్ని సీఎస్ తో మాట్లాడిన తర్వాత బీసీ కమిషన్ అధ్యయనం చేస్తుందని చెప్పారు.

KCR

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నాలుగేళ్లుగా బీసీలు, సంచార జాతులకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, బీసీ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అధ్యయనాన్ని గౌరీశంకర్ తన పుస్తకంలో రాశారు. ప్రధానంగా సంచారజాతులకు చెందిన కులాల వాళ్లు, వాళ్ల పిల్లల విద్యాభ్యాసానికి సంబంధించి 718 గురుకుల పాఠశాలల పురోభివృద్ధిని రికార్డు చేశారు. సంచార కులాల పిల్లలు తొలిసారిగా బడి గడప తొక్కిన సందర్భాన్ని ఈ పుస్తకంలో ప్రస్తుతించారు. అట్టడుగున వున్న కులాలను గుర్తించి వారికి సాయం అందించే స్థితి కూడా తెలంగాణ రాష్ట్రం అవతరణతో జరిగిందని ఈ పుస్తకంలోని వ్యాసాలు తెలియజేస్తున్నాయి.

బీసీ కులాలలో సారోల్లు, అర్వకోమటి, తోలుబొమ్మలాటవారు, కుల్లకడిగి, బైల్ కమ్మర, అహిర్, గోవిలి, బాగోతుల, బొప్పాల, గంజికూటి వారు, శ్రీక్షత్రియ రామజోగి, ఇనూటి, గుర్రపువారు, అడ్డాపువారు, సారగాని, కడారి తిడారోళ్లు, ఓడ్, పాథం వారు, సాధనా శూరులు, రుంజ, పనాస, పెక్కర, పాండవులవారు, గొడజెట్టి, ఆదికొడుకులు, తెరచీరల, కాకిపడగల, మందహెచ్చుల, పప్పాల, సన్నాయిలు, బత్తిన కులాలకు చెందిన సంచార జాతులను బీసీ కులాల జాబితాలో చేర్చవలసి వుంది. రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -