విపక్ష కూటమిపై ప్రజల్లో కూడా నో క్లారిటీ !

66
- Advertisement -

2024 సార్వత్రికలు దగ్గరపడుతున్న కొద్ది దేశరాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి బీజేపీని గద్దె దించాలని విపక్షాలన్నీ ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 26 పార్టీలు ఉన్న ఈ కూటమిలో ఇంకా పార్టీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా మోడి సర్కార్ పై ఉన్న వ్యతిరేకతను ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికలతో తాము అధికారంలోకి రావాలని ఆశిస్తున్నాయి విపక్షాలు. అయితే విపక్ష కూటమిని మొదటి నుంచి కూడా ఒక ప్రశ్న గట్టిగా వేధిస్తోంది. అదే విపక్షాల తరుపున ప్రధాని అభ్యర్థి ఎవరనే సంగతి. రాహుల్ గాంధీ, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, కేజ్రివాల్ ఇలా అగ్రనేతలంతా ప్రధాని అభ్యర్థిగా ఉండేందుకు ఆశపడుతున్నారు.

కానీ అరవింద్ కేజ్రివాల్ ప్రధాని రేస్ లో లేనట్లు ఆప్ ఇటీవల స్పష్టం చేసింది. అయితే విపక్షాల తరుపున ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉండాలంటే దానిపై సి ఓటర్ అల్ ఇండియా సర్వే ఇచ్చిన రిపోర్ట్ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ సర్వే ప్రకారం రాహుల్ గాంధీ ప్రధానిగా ఉండాలని 20 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారట. అలాగే కేజ్రివాల్ 9 శాతం, నితిశ్ కుమార్ 6 శాతం, మమతా బెనర్జీ 3 శాతం మంది ప్రధాని గా ఉండాలని ఆశిస్తున్నారట. అయితే మెజారిటీగా 40 శాతం ప్రజలు వారిలో ఎవరు ప్రధాని అభ్యర్థులుగా ఉండడానికి అర్హులు కాదని చెబుతున్నారట.

దీంతో ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థిగా ప్రజలు ఎవరిని కోరుకోవడం లేదా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అయితే విపక్షల్లో ప్రధాని అభ్యర్థిపై క్లారిటీ లేనందువల్లే ప్రజల్లో అలాంటి అభిప్రాయం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇటీవలే విపక్ష కూటమిలోని అగ్రనేతలు పలు మార్లు సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో సీట్ల కేటాయింపులపై ప్రధానంగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అలాగే ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉండాలనే దానిపై కూడా తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందట. మొత్తానికి విపక్షాల తరుపున ఉండే ప్రధాని అభ్యర్థి పై ప్రజల్లో అనాసక్తి ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది.

Also Read:షర్మిల చూపు తెలంగాణ వైపే!

- Advertisement -