వడ్డీ రేట్లు యథాతథం…

270
No change in repo rate
- Advertisement -

పెద్ద నోట్ల రద్దుతో పెద్ద ఎత్తున డిపాజిట్లు వచ్చి పడుతుండటంతో కీలక వడ్డీరేట్లను తగ్గుతాయన్న విశ్లేషకుల అంచనాలపై ఆర్‌బీఐ నీళ్లు చల్లింది. నోట్ల ర‌ద్దు త‌ర్వాత జ‌రిగిన తొలి ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధాన స‌మీక్ష‌లో వ‌డ్డీ రేట్ల‌ను మార్చ‌లేదు. ఈసారి 50 బేసిస్ పాయింట్ల వ‌ర‌కు రెపో రేటు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసినా.. కీల‌క వ‌డ్డీరేట్ల‌లో ఎలాంటి మార్పు లేద‌ని ఆర్బీఐ స్ప‌ష్టంచేసింది.

రెపో రేటు 6.25శాతాన్ని అలాగే ఉంచింది. నాలుగో త్రైమాసికం నాటికి రిటైల్‌ ద్రవ్యోల్బణం 5శాతం ఉంటుందని అంచనా వేసింది. 2016-17లో వృద్ధిరేటు అంచనాను 7.6 నుంచి 7.1 శాతానికి ఆర్‌బీఐ తగ్గించింది.ఆర్బీఐ నిర్ణయంతో సెన్సెక్స్ పతనమైంది. వడ్డీ రేట్లు యథాతథమని ప్రకటించిన వెంటనే సెన్సెక్స్ 162 పాయింట్లు, నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయాయి.

బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ఇప్పటికే డిపాజిట్లపై రేట్లు తగ్గించడంతో రుణాలపైనా వడ్డీ రేట్లు తగ్గుతాయని అంతా భావించారు. కానీ ఆర్బీఐ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దేశంలోనే నల్లదనాన్ని వెలికితీసేందుకే పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ఆర్బీఐ మరోసారి స్పష్టం చేసింది.ఇప్పటివరకు 11.55 లక్షల నోట్లు బ్యాంకుల్లో డిపాజిటైనట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -