బ్రిటన్లో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ విజృంభణ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ నుంచి డిసెంబర్ 31 వరకు తాత్కాలికంగా విమాన రాకపోకల నిలిపివేశారు. 22వ తేదీ అర్ధరాత్రి నుంచి ఇది అమలవుతుందని తెలిపిన కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది. 22వ తేదీ అర్ధరాత్రికి ముందు బ్రిటన్ నుంచి వచ్చేవారికి ఆర్ టి-పిసిఆర్ పరీక్షలు తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయించింది.
బ‌్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సోమవారం స్పందించారు. ప్రభుత్వం అలెర్ట్‌గా ఉన్నదని, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. యూకేలోని కొత్త రకం వైరస్‌పై శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని ఆయన చెప్పారు. ఊహాజనిత పరిస్థితులు, వివరణలు చూసి భయపడిపోవద్దు. ఇక్కడ మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. అయితే మన సైంటిస్టులు మాత్రం ఎప్పటికప్పుడు ఈ కొత్త రకం వైరస్ గురించి తెలుసుకుంటూనే ఉన్నారు అని హర్షవర్ధన్ తెలిపారు.
యూకేలో వెలుగుచూసిన ఈ కొత్త రకం వైరస్‌పై చర్చించడానికే సోమవారం జాయింట్ మానిటరింగ్ గ్రూప్‌తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బ్రిటన్‌లో కనిపించిన ఈ కొత్త రకం కరోనా వైరస్ అంతకుముందు వైరస్ కంటే చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీంతో లండన్‌తోపాటు ఆగ్నేయ ఇంగ్లండ్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించారు. పరిస్థితి చేయి దాటిపోయిందని అక్కడి ఆరోగ్య మంత్రి హాంకాక్ చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా దేశాలు యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి.