తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు ఆపాలంటూ కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి.
బుధవారం ఉదయం 10గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. 11వ తేదిన నామినేషన్లు పరిశీలించనున్నారు. ఈనెల 14న మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరించుకోవచ్చని.. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ ఉండనున్నట్లు తెలిపారు.మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ల ఎన్నిక తేదీ తర్వాత ప్రకటిస్తామన్నారు. ఈనెల 22న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. అలాగే ఈనెల 25న ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి.