హోదా ఇస్తే.. క్రెడిట్ మీకే ?

26
- Advertisement -

ఏపీలో అధికార వైసీపీ మరియు బీజేపీ మద్య నిన్న మొన్నటి వరకు అంతర్గత పొత్తు ఉందని, ఈ రెండు పార్టీలు ఒకటేనని ఇలా రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ మద్య ఏపీలో వచ్చిన బీజేపీ పెద్దలు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో ఒక్కసారిగా అభిప్రాయాలన్నీ తలకిందులయ్యాయి. అటు జగన్ కూడా బీజేపీ తమతో లేదని స్పష్టం చేయడంతో ఇరు పార్టీల మద్య ఎలాంటి పొత్తు లేదనే విషయం స్పష్టమైంది. ఇక అప్పటి నుంచి వైసీపీ సర్కార్ టార్గెట్ గా ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేయడం అలాగే వైసీపీ నేతలు కూడా బీజేపీకి ఘాటుగానే రీప్లే ఇవ్వడం జరుగుతూ వస్తోంది. .

కాగా విభజన హామీల విషయంలో గతంలో కేంద్రంపై పెద్దగా విమర్శలు చేయని వైసీపీ నేతలు ఇప్పుడు తరచూ విభజన హామీల విషయంలో బీజేపీని ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంచితే ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరి.. జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు జగన్ పేరు పెట్టుకుంటూ క్రెడిట్ పొందుతున్నారని, రాష్ట్రంలో అమలౌతున్న చాలా పథకాలు కేంద్రం ప్రవేశ పెట్టినవేనని ఆమె విమర్శలు గుప్పించారు.

పురందేశ్వరి విమర్శలకు కౌంటర్ గా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ ” రాష్ట్రనికి ప్రత్యేక హోదా ఇవ్వండి,. విశాఖా ప్రయివేటీకరణ ఆపండి, పోలవరం ప్రాజెక్ట్, చెన్నై వైజాగ్ కారిడార్ పూర్తి చేయండి ” అప్పుడు క్రెడిట్ అంతా మీకే ఇస్తామంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు విజయసాయి రెడ్డి. కాగా విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఇన్నాళ్ళు కేంద్రాన్ని నిలదీయడంలో ఎందుకు వెనుకడుగు వేశారని కామెంట్స్ చేస్తున్నారు. కేంద్రం మెడలు వొంచి హోదా తెస్తామని చెప్పిన వైసీపీ.. ఇన్నాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉండిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి రోజురోజుకూ బీజేపీ మరియు వైసీపీ మద్య రాజకీయ వేడి పెరుగుతోంది.

Also Read:పవన్ కు జగన్ శత్రువు కదా..?

- Advertisement -