మరోసారి నదుల అనుసంధానం ప్రక్రియను తెరమీదకు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రతీ ఏటా భారీ ఎత్తున సముద్రం పాలవుతున్న వరదనీటిని సాగు, తాగునీటి అవసరాలకు మళ్లించడానికి భారీ కసరత్తు మొదలు పెట్టింది. ఇందుకోసం ఏకంగా రూ. 5.5 లక్షల కోట్లతో భారీ ప్రాజెక్టను చేపట్టేందుకు రంగం సిద్దం చేసింది. దేశంలోని 60 నదులను అనుసంధానం చేసి, నీటికి ఎక్కడికక్కడ ఒడిసిపట్టాలని ప్రణాళిక రచిస్తోంది.
ప్రధాని మోడీ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వీటిలో ఉత్తరాది సాగుకు వెన్నెముకలాంటి గంగానది కూడా ఉంది. దేశంలోని పెద్ద నదులను అనుసంధానం చేయడం ద్వారా ఘోరమైన వరదలను, కరువులను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కొన్నాళ్ల కిందట అటకెక్కిన 87 బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్ట్ గురించి మరికొద్దిరోజుల్లో పూర్తి సమాచారం వెలువడనుంది. నదుల అనుసంధానం ద్వారా లక్షల హెక్టార్ల భూమిని సాగులోకి తీసుకొచ్చిన రుతపవనాలపై ఆధారపడే దుస్థితి తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే వర్షం కోసం రైతులు ఆకాశం వైపు చూసే పరిస్థితి మారనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే అనేక జల విద్యుత్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. అయితే పర్యవరణవేత్తలు, జంతు ప్రేమికులు, రాజ కుటుంబాల నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ వెనక్కు తగ్గడం లేదు. కెన్ నదిపై రిజర్వాయర్ నిర్మించి, అక్కడ నుంచి 22 కిలోమీటర్ల దూరంలోని బెట్వా నదికి అనుసంధానం చేస్తారు. యూపీ నుంచి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టునున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో అనుమతి మంజూరయ్యింది. గంగ, గోదావరి, మహానది లాంటి పెద్ద నదుల అనుసంధానమే కరువులు, వరదలకు నివారణకు ఏకైక పరిష్కారమని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.