దేశం ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్తోంది

202
pmmodi

యావత్‌ దేశవ్యాప్తంగా 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వెన్నలా జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ దేశ ప్రజలకు 72వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ దేశం నవ చైతన్యం, నూతనోత్తేజంతో అన్ని రంగాల్లో పురోగమిస్తుందని, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతోందని అన్నారు.

 -pm-modi

తమ ప్రభుత్వం అణగారిన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతోందని, తమ హాయాంలో దేశం అభివృద్ధిలో ఉన్నత శిఖరాలను అదిరోహిస్తోందని మోడీ పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు, స్వాతంత్ర్య సమరయోధులకు తన శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా నిరంతరం శ్రమిస్తున్నామని, ప్రజల ఆశలను నెరవేర్చే స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ముందుకు సాగుతున్నామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ స్థితిగతులను వివరించారు.

దేశంలో ఒక వైపు వర్షాలు పడుతున్నాయన్న సంతోషం ఉండగా మరోవైపు వరదలు వస్తున్నాయన్న బాధ కలుగుతోందని, ఎన్నో సవాళ్లను అడ్డంకులను అధిగమిస్తున్నామని, దేశంలోని ప్రతి పౌరునికి న్యాయం చేకూర్చే విధంగా, వారందరూ అభివృద్ధిలో ముందుకు సాగాలని మోడీ ఆకాంక్షించారు. దేశమంతటా విద్యుత్‌ వెలుగులు నింపామని, దేశం డిజిటల్ ఇండియా వైపు అడుగులు వేస్తోందని, ఇండియన్‌ నేవీలో ఆరుగులు మహిళలు సేవలందించడం తనకెంతో గౌరవంగా ఉందని, దేశ మహిళల శక్తిని ఆ ఆరుగురు మహిళలు చాటుతున్నారని మోడీ పేర్కొన్నారు.

 -pm-modi

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మిజోరాం, ఉత్తరాఖండ్‌ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారని, ఎవరెస్టుపై ఆ చిన్నారులు జాతీయ పతకాన్ని ఎగరేసి ప్రజల్లో స్పూర్తి నింపారన్నారు ప్రధాని మోడీ. దేశంలోని ప్రతి గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించాలన్న తన స్వప్నం సాకారమవుతోందని, నాలుగేళ్లలో ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించాలన్న లక్ష్యాన్ని తాము చేరుకున్నామని, దేశంలోని ప్రతి పాఠశాలలో మరుగుదొడ్డి నిర్మించాలన్న లక్ష్యం తమ ముందు ఉందని, ఇంటింటికి గ్యాస్‌ కనెక్షన్‌ ఇవ్వాలన్న తమ లక్ష్యం నెరవేరిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియా మాదిరిగా పనిచేస్తున్నాయని, దేశంలోని వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించామని, రైతులకు కనీస మద్దతు ధర కల్పించిన ఘతన తమ ప్రభుత్వానిదేనని ప్రధాని మోడీ పేర్కొన్నారు. రైతులను గత పాలకులు పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని మోడీ స్పష్టం చేశారు.