ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు దేశంలోని 9 విపక్ష పార్టీలకు చెందిన నేతలు. ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ మేరకు ఉమ్మడి లేఖ రాశారు. ఇందులో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, శివసేన (ఉద్ధవ్) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సంతకాలు చేశారు.
దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తున్నదని …బీజేపీయేతర నేతలను ఇరికించేందుకు సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. 2014 నుంచి బీజేపీ హయాంలో కేసులు నమోదుచేసినవారిలో ఎక్కువ మంది ప్రతిపక్షాలకు చెందినవారే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు.
శారద చిట్‌ఫండ్ స్కామ్‌లో కాంగ్రెస్ మాజీ నేత, ప్రస్తుత అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై సీబీఐ, ఈడీలు 2014, 2015లో విచారణ జరిపాయి. అయితే ఆయన బీజేపీలో చేరిన తర్వాత కేసులో ఎలాంటి పురోగతి లేదన్నారు. నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో టీఎంసీ మాజీ నేత, ప్రస్తుత బీజేపీ నాయకుడు సువేందు అధికారి, ముకుల్ రాయ్‌పై ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయని అయితే ప్రస్తుతం ఈ కేసుల్లో కదలిక లేదని లేఖలో పేర్కొన్నారు. మహారాష్ట్రలో నారాయణ్ రాణె వంటి వారి విషయంలోనూ ఇదే జరిగిందని వెల్లడించారు. ఎన్నికల సమయాల్లో ప్రతిపక్షల నేతలపై ఈడీ, సీబీఐ దాడులు ఉధృతం కావడం స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఇవన్నీ రాజకీయ ప్రోద్బలంతోనే జరిగాయని స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో ప్రభుత్వాన్ని విపక్షాలు ప్రశ్నించాయని, ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ వంటి సంస్థలు ఒక సంస్థలో పెట్టుబడులు పెట్టడం వల్ల రూ.78 వేల కోట్లు కోల్పోయాయని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.ఒక పార్టీకో, వ్యక్తికో భిన్నంగా ఉన్న భావజాలాన్ని కూడా గౌరవించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..