స్టార్ పర్ఫార్మర్ గా మిషన్ భగీరథః స్మితా సబర్వాల్

474
smita sabarwal
- Advertisement -

మిషన్ భగీరథనే ఇప్పుడు తెలంగాణలో స్టార్ పెర్ఫార్మర్ అన్నారు సి.ఎం.ఓ, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 55 లక్షలకు పైగా ఇండ్లకు శుద్ది చేసిన నీటిని నల్లాలతో సరాఫరా చేయడం లేదన్నారు. ఎర్రమంజిల్ ల్లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సి.ఎం.ఓ, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. ప్రతీ ఊరికి మిషన్ భగీరథ నీరు సరఫరా అవడంతో ఈ వేసవిలో ప్రత్యేకంగా ఎలాంటి సమ్మర్ యాక్షన్ ప్లాన్ అవసరం రాలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతీ వేసవికి ట్యాంకర్స్ తో నీటిని సరఫరా చేయాల్సి వచ్చేదని గుర్తు చేశారు. మిషన్ భగీరథతో ఎలాంటి తాగునీటి సమస్యలు రాకుండా ఈ వేసవి గడిచిందన్నారు.

Smitha Sabarawal

తీవ్రమైన ఎండలను కూడా లెక్క చేయకుండా పనిచేసిన భగీరథ ఇంజినీర్లు, ఏజెన్సీ ప్రతినిధులకు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు చెప్పారు. భగీరథ పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి సంతృప్తితో ఉన్నారన్న స్మితా సబర్వాల్, ప్రతీ ఊరికి నీళ్లు సరఫరా అవుతున్నా కూడా ఇంకా కొన్ని ఓ.హెచ్.ఎస్.ఆర్ లు నిర్మించాల్సి ఉందన్నారు. చివరి ఓ.హెచ్.ఎస్.ఆర్ నిర్మాణం కూడా అయితేనే మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పూర్తి అయినట్టన్నారు. గత నెలలో ఓ.హెచ్.ఎస్.ఆర్ నిర్మాణాల్లో అద్భుతమైన ప్రగతి కనిపించిందని చెప్పారు. అదే వేగంతో జులై చివరి నాటికి మిగతా వాటి నిర్మాణాలు కూడా పూర్తి చేయాలన్నారు. ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల కారణంగా ఓ.హెచ్.ఎస్.ఆర్ నిర్మాణాలు స్లో గా అవుతున్న ప్రాంతాలకు స్పెషల్ ఆఫీసర్స్ ను నియమించాలని ఈ.ఎన్. సి కృపాకర్ రెడ్డిని ఆదేశించారు.

ఇప్పటివరకు ఆశించినంత వర్షపాతం కురవలేదన్న సబర్వాల్, తాగునీటి సరాఫరాకు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని అధికారులకు సూచించారు. గురుకులాలు, సాంఘీక సంక్షేమ స్కూళ్లు, డబుల్ బెడ్ రూం కాలనీలతో పాటు ప్రభుత్వ సంస్థలకు కూడా భగీరథ నీటినే సరఫరా చేయడంపై ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రతీ ఊరికి నీటి సరాఫరా అవుతున్నందున సురక్షిత తాగునీటి వినియోగం, నీటి పొదుపుతో పాటు భగీరథ విశిష్టతపై అగష్టులో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భగీరథ విభాగంలోని ప్రతీ ఒక్క ఇంజనీరు, ఉద్యోగి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్దేశించారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పై త్వరలోనే సమావేశం నిర్వహించే అవకాశం ఉందని స్మితా సబర్వాల్ తెలిపారు. ఈ సమావేశంలో ఈ.ఎన్. సి కృపాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజినీర్లు జగన్ మోహన్ రెడ్డి, విజయ్ ప్రకాశ్, రమేశ్, వినోభా దేవి, ప్రసాద్ రెడ్డి, చక్రవర్తి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రావు, చిన్నా రెడ్డి, శ్రీనివాస్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -