పూలే విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన మంత్రులు..

135
ministers
- Advertisement -

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ని పురస్కరించుకుని వరంగల్ ములుగు రోడ్డు లోని ఫూలే విగ్రహానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీ లు గుండు సుధారాణి, సీతారాం నాయక్ తదితరులు కలిసి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మంత్రులతో పాటు పలువురు వక్తలు మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. జ్యోతి రావు పూలే గొప్ప విద్యావేత్త, సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు.కుల వివక్ష పై ఆనాడే పోరాటం చేసిన మహానుభావుడు.తాను చెప్పింది ఆచరించిన గొప్ప మనిషి, మహాత్మా జ్యోతీరావ్ ఫులే మహారాష్ట్రలోని పూణె జిల్లా ఖానావాడిలో 11 ఏప్రిల్ 1827న వ్యవసాయ తోట మాలి కులానికి చెందిన కుటుంబంలో పుట్టాడు. 1848లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో పూలే, కులవివక్షకు గురయ్యాడు. అప్పుడే కుల వివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. కుల విధానంలో ఆయన తన సామాజిక వర్గ లోపాలను కూడా ఎత్తి చూపారు. జ్ఞాన సంపదకు, అందరికీ అవకాశం రావాలన్నారు. సమాజంలో సగ భాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించాడు. అందువల్ల స్త్రీలు విద్యావంతులు కావాలని నమ్మాడు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడు.

1848 ఆగస్టులో బాలికలకు పాఠశాల స్థాపించాడు ఫూలే. ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడం, అంటరానివారికి కూడా బోధించవలసిరావడంతో ఉపాధ్యాయులెవరూ ముందుకు రాలేదు. చివరకు జోతిరావ్‌ పూలే తనభార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు. 1864లో “బాలహత్య ప్రతిబంధక్ గృహ” స్థాపించి, వితంతువులెైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచాడు. దేశంలోనే ఇటువంటి కేంద్రం స్థాపించడం ఇదే మొదటిసారి. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి పూలే దత్తత తీసుకున్నాడు.

1873 సెప్టెంబరు 24న సత్య శోధక సమాజాన్ని పూలే స్థాపించాడు.దేశంలోనే ఇది మొట్ట మొదటి సంస్కరణోద్యమం. స్త్రీ, పురుషుల మధ్య లింగవివక్షను ఫూలే విమర్శించాడు. సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమసమాజం ఉండాలన్నా డు.1877లో సత్యశోధక సమాజం తరపున ‘దీనబంధు’ వార పత్రిక ప్రారంభించాడు. 1880లో భారత ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ పితామహుడులో ఖాండేతో కలసి రెైతులను, కార్మికులను సంఘటితం చేశాడు. 1873లో ‘గులాంగిరి’ (బానిసత్వం) పుస్తకం ప్రచురించాడు. ఫూలే సామాజిక సంస్కరణోద్యమానికి చేదోడువాదోడై నిలిచిన జాయా కారాడీ లింగు.. తెలంగాణ కన్న మున్నూరు కాపు ముద్దు బిడ్డ. నైజాం సంస్థానంలో న్యాయమూర్తి పదవిని కాదన్నాడు.

సామాజిక ఉద్యమకారునిగా సుప్రసిద్ధులైన ఆయన పుణే మునిసిపాలిటీకి ఎన్నికై, 12 ఏళ్ళు ప్రజాప్రతినిధిగా పనిచేశారు. దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మ పూలే 1890 నవంబరు 28న కన్నుమూశాడు. పూలే ఆలోచన విధానం స్పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. సిఎం కెసిఆర్ కుల వృత్తులకు సామాజిక గౌరవం కల్పించారు. ఆరున్నర ఏండ్లుగా ఏటా 45 వేల కోట్ల ఖర్చుతో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీ, మహిళా వర్గాల సమున్నతి కోసం ఆ పథకాలు ఉపయోగపడుతున్నాయి.

హైదరాబాద్‌లో విలువైన స్థలాలను కేటాయించి తెలంగాణలోని బీసీలు, ఎంబీసీల ఆత్మగౌరవం పెరిగేలా ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నారు. అభివృద్ది సంక్షేమ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నవి. విద్యా రంగంలో మహాత్మా ఫూలే విదేశీ విద్యానిధి.. పేరుతో విదేశీ విద్యను ప్రభుత్వ ఖర్చుతో బడుగు బలహీన వర్గాలకు అందచేస్తున్నది.గురుకుల విద్యా వ్యవస్థల్లో సాధిస్తున్న ఫలితాలు, జ్యోతిబాఫూలే అందించిన స్పూర్తి ఫలాలే..మహిళలకు విద్య, వైద్యం, రక్షణ కోసం ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో.. పలువురు స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -