నిన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఛాలెంజ్ చేస్తున్నాను.. నా పాస్ బుక్‌లో ఉన్నదాని కంటే ఒక్క గజం ఎక్కువ ఉంటే మొత్తం దానం చేస్తాను అని స్పష్టం చేశారు. బండి సంజయ్ చెప్పిన సర్వే నెంబర్‌లో పట్టాభూమి కాకుంటే నా మొత్తం ఆస్తి దానం చేస్తానని స్పష్టం చేశారు. నా దగ్గర ఉన్న సర్వే నంబర్లు తప్పు అయితే నా అన్ని పదవులకు రాజీనామా చేస్తా- నిజం కాకపోతే సంజయ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తావా? అని సవాల్ విసిరారు.
నిన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై, ఆయన తీరుపై సమాజమే సిగ్గు పడుతుందన్నారు. ఒక జాతీయ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడినని మరిచిపోయి, చరిత్ర గల నాయకులపై నిందారోపణలు చేయడం చాలా బాధాకరమన్నారు. ఒక ఉద్యోగిగా ఉండి.. తెలంగాణ సాధనలో సీఎం కేసీఆర్‌కు వెన్నంటి ఉన్నాం. ప్రాణాలకు తెగించి, జైళ్లకు పోయినా తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఒకరి గురించి మాట్లాడే ముందు వారి చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి.
తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ స్థానం ఎక్కడ? అని ప్రశ్నించారు. తెలంగాణకు నిధులు ఇవ్వకపోయినా, కరోనా వ్యాక్సిన్ల విషయంలో నిర్లక్ష్యం వహించినా ప్రధానిని విమర్శించలేదు. తాము కేంద్రం పట్ల గౌరవంగా ఉన్నామని తెలిపారు. సీఎం కేసీఆర్‌పై ఏకవచనంలో విమర్శలు చేయడం దారుణమన్నారు. బీసీ నాయకుడిని అని చెప్పుకునే నీకు ఆ లక్షణాలు లేనే లేవు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. కలిసొచ్చిన అధ్యక్ష పదవికి గౌరవం ఇస్తూ మాట్లాడితే బాగుండు అని మంత్రి సూచించారు.