గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి- మంత్రులు

25

రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌ రావులు ఈరోజు హైదరాబాద్‌లోని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన క్యాంప్ కార్యాలయంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో లాక్ డౌన్ తరువాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబబాద్, ములుగు, తోర్రుర్, మరిపెడ లాంటి ప్రదేశాలలో గుడుంబా అమ్మకాలు సాగిస్తున్నారన్నారనే సమాచారంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారితో కలసి ఆబ్కారీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుడుంబా నిర్ములనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట, కొల్లపూర్ లలో అక్కడక్కడా గుడుంబా అమ్మకాలు జరుగుతున్నాయి వాటిని వెంటనే నిర్ములించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులు ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. గంజాయిని అమ్మకాలు, రవాణా చేస్తున్న వారిపై PD ఆక్ట్ , బైండోవర్ కేసులను నమోదు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పోలీస్, ఆబ్కారీ శాఖల అధికారులు సమన్వయం చేసుకొని గంజాయి స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. గుడుంబా, గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మంత్రి అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దేశంలో ఎక్కడా లేని విధంగా గీత వృత్తిదారుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టారన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ లోని నీరా కేఫ్‌ను నెక్లాస్ రోడ్డులో నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. నీరా అనుబంధ ఉత్పత్తులకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని నందనంలో పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నీరా ఉత్పత్తి ప్రభుత్వం ఇప్పటికే జీఓ ను విడుదల చేసిందన్నారు. బిసి కార్పొరేషన్, ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు వెంటనే సమన్వయ సమావేశం నిర్వహించుకొని టెండర్లు పిలవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నీరా పాలసి పనులను వేగవంతం చేసి వచ్చే రెండు నెలల్లో అందుబాటులోకి తేవాలన్నారు.

ఈ సమీక్ష సమావేశం లో రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు కమిషనర్ అజయ్ రావు, జాయింట్ కమిషనర్ ఖురేషీ, డిప్యూటీ కమిషనర్ లు అంజన్ రావు, హరికిషన్, డేవిడ్ రవికాంత్, సహాయ కమిషనర్‌లు దత్తరాజు గౌడ్, చంద్రయ్య గౌడ్, రఘురామ్, ఎక్సైజ్ సూపరిండెంట్ లు సత్యనారాయణ, అరుణ్ కుమార్, రవీందర్ రావు విజయ భాస్కర్ లు పాల్గొన్నారు.