ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే భయంతోనే ఆ పార్టీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్‌పై శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. గతంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు హుందాగా మాట్లాడేవారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడున్న అధ్యక్షుడు మాత్రం సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. మహిళా దినోత్సవం జరుపుకుంటున్న వేళ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదన్నారు.
బండి సంజయ్‌కి పిచ్చి పట్టినట్లు ఉందన్నారు. సంజయ్‌ను తక్షణమే బీజేపీ రాష్ర్ట అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మహబూబ్‌నగర్ అభివృద్ధి నిరోధకులుగా డీకే అరుణ మారారని మండిపడ్డారు. గద్వాలలో ముఖం చెల్లక మహబూబ్‌నగర్‌లో అరుణ తిరుగుతుందని ఎద్దెవా చేశారు. బడుగు, బలహీన వర్గాలను అంతం చేసిన చరిత్ర బీజేపీది అని మంత్రి దుయ్యబట్టారు. అధికారం శాశ్వతం కాదు.. సభ్యత, సంస్కారం ముఖ్యమని చెప్పారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. ఊరుకునేది లేదని బీజేపీ నాయకులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.