దిగుబడి పెరగాలి.. ఆదాయం వృద్ధి చెందాలి..

309
niranjan reddy

బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో తెలంగాణ విత్తనాభివృధ్ది సంస్థ విత్తనరైతు బోజిరెడ్డి వేరుశనగ బ్రీడర్ సీడ్ సాగు క్షేత్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైతులు పండించే ధన్యం దిగుబడి పెరగాలి. రైతుల ఆదాయం వృద్ధి చెందాలి. ప్రస్తుతం వేరుశనగకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇతర నూనె గింజలతో పోలిస్తే వేరుశనగ శ్రేష్టమైనది, పౌష్టికమైనది. దేశంలో అత్యధిక వేరుశనగ దిగుబడి ఉమ్మడి పాలమూరు జిల్లా భూముల సొంతం. వేరుశనగ సాగులో వనపర్తి జిల్లాది అగ్రస్థానం. ఆరుతడి పంట అయిన వేరుశనగ నుండి భూసారం పెరుగుతుంది. అలాగే నీటి అవసరం తక్కువ, 110 రోజుల పంటకాలం ఉంటుందని మంత్రి తెలిపారు.

అఫ్లాటాక్సిన్ ఫంగస్ లేని వేరుశనగకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. పాలమూరులో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఉన్నాయి. కేంద్రం నుండి పరిశోధనా కేంద్రానికి అత్యధిక నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచంలో అత్యున్నత ఆరోగ్య ప్రమాణాలతో, శరీర సౌష్టవంతో ఉన్న నెదర్లాండ్ ప్రజలు ఎక్కువగా ఉపయోగించేది వేరుశనగ ఉత్పత్తులే అని నిరంజన్‌రెడ్డి అన్నారు.

వేరుశనగ నుండి వచ్చే పీనట్ బట్టర్‌కు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడి ఉన్న వేరుశనగను 25 నుండి 30 క్వింటాళ్లు వచ్చేలా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు చేస్తోంది. అంతర్జాతీయ ఎగుమతులకు అనుకూలమైన పంటలు పండించేలా రైతులను చైతన్యం చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ ,తెలంగాణ విత్తనాభిద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, డైరెక్టర్ కేశవులు, నల్లగొండ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాంచందర్ నాయక్ తదితరులు హాజరైయ్యారు.