రైతులకు కేంద్రం చేసిందేమి లేదు- మంత్రి నిరంజ‌న్ రెడ్డి

43

తెలంగాణ‌లో రాబోయే యాసంగిలో ఎట్టిప‌రిస్థితుల్లోనూ కేంద్రం బియ్యం కొన‌ద‌ని కేంద్ర‌మంత్రి పీయూష్ గోయ‌ల్ తేల్చిచెప్పిన‌ట్లు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు. పీయూష్ గోయ‌ల్‌తో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల స‌మావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంత‌రం మంత్రి నిరంజ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రాన్ని స్ప‌ష్ట‌త కోరామ‌ని నిరంజ‌న్ రెడ్డి చెప్పారు. యాసంగిలో ధాన్యం కొనేది లేద‌ని కేంద్ర‌మంత్రి స్ప‌ష్టం చేశారు. వానాకాలంలో 60 ల‌క్ష‌ల ట‌న్నులు కొనాల‌ని ల‌క్ష్యం నిర్దేశించారు. కేంద్రం నిర్దేశించిన ల‌క్ష్యం 3 రోజుల్లో పూర్తి కానుంది. రాష్ట్రంలో కొనాల్సిన ధాన్యం ఇంకా 10 నుంచి 12 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం ఉంది. మ‌రో 5 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి కోత‌లు జ‌రుగుతున్నాయి. ఆ ధాన్యం జ‌న‌వ‌రి 15వ తేదీ వ‌ర‌కు అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు. మిగ‌తా ధాన్యం సేక‌రించాలా? వ‌ద్దా? అని స్ప‌ష్ట‌త కోరాం. కొనుగోలు కేంద్రాలు ఉంచాలా? మూసివేయాలా? అని అడిగాం. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రాన్ని లిఖిత‌పూర్వ‌క హామీ కోరాం. ఏ విష‌య‌మూ చెప్పేందుకు పీయూష్ గోయ‌ల్ రెండు రోజులు స‌మ‌యం కోరారు. రెండు రోజుల త‌ర్వాత పీయూష్ గోయ‌ల్‌ను క‌లుస్తాం. ఒక‌ట్రెండు రోజులు ఇక్క‌డే ఉంటాం. ధాన్యం సేక‌ర‌ణ‌పై తేల్చుకున్న త‌ర్వాత‌నే తెలంగాణ‌కు తిరిగి ప‌య‌న‌మ‌వుతాం అని మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ బీజేపీ నాయ‌కులు మాట్లాడుతున్న అంశాల‌ను ప్ర‌స్తావించాం. మీ ఎఫ్‌సీఐ అధికారులు బియ్యం త‌ర‌లించ‌క‌పోతే అది మా త‌ప్పు కాద‌ని కేంద్ర‌మంత్రికి వివ‌రించాం. 30 నుంచి 40 వేల మెట్రిక్ ట‌న్నుల బియ్యాన్ని ప్ర‌తి రోజు లిఫ్ట్ చేసుకునే అవ‌కాశం ఉంది. నెల‌కు 10 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల దాకా మిల్లింగ్ చేసి ఇచ్చే సామ‌ర్థ్యం తెలంగాణ‌కు ఉంద‌ని కేంద్ర‌మంత్రికి చెప్పామ‌ని నిరంజ‌న్ రెడ్డి తెలిపారు. వెంట‌నే కేంద్ర‌మంత్రి స్పందించి.. మా బియ్యం మేం తీసుకుంటామ‌ని చెప్పారు. సంబంధిత అధికారుల‌తో మాట్లాడి తెలంగాణ‌లోని గ‌త సీజ‌న్‌కు సంబంధించిన బియ్యం నిల్వ‌ల‌ను తెప్పించుకుంటామ‌ని పీయూష్ గోయ‌ల్ చెప్పిన‌ట్లు నిరంజ‌న్ రెడ్డి వెల్ల‌డించారు.

దేశంలోనే తెలంగాణలో వరి ఉత్పత్తి ఎక్కువ వస్తుంది. ఏడేళ్ల క్రితం 35 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి ఉంటే, నేడు 3 కోట్ల టన్నులకు చేరుకుంది. సీఎం కేసీఆర్ రైతు మద్దతు చర్యల వల్ల సాగు విస్తీర్ణం, పంట దిగుబడి పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మా సొంత నిధులతో కట్టుకున్నాం. తెలంగాణ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమి లేదు. చేయాల్సిన ధాన్యం సేకరణ కూడా సరిగ్గా చేయడం లేదని మంత్రి నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు.