మూసి ప్రక్షాళనపై సీఎం కేసీఆర్ కు స్పష్టమైన ఆలోచన ఉంది

185
ktr
- Advertisement -

మూసి రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పై ఈరోజు పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్ చైర్మన్ సుధీర్ రెడ్డి తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరైన ఈ కార్యక్రమం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగింది. మూసీ ప్రక్షాళనకు సంబంధించి ముఖ్యమంత్రి కి స్పష్టమైన ఆలోచన ఉన్నదని… ఆ ఆలోచన మేరకే కార్పొరేషన్ ముందుకు తీసుకుపోవాలని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో మూసీలో పేరుకుపోయిన చెత్తను, పిచ్చి మొక్కలను దశలవారీగా తీసివేసే కార్యక్రమం కొనసాగించాలని సూచించారు. తద్వారా దోమల బెడద ను కొంత వరకు తగ్గించగలిగే అవకాశం ఉన్నదని మంత్రి అన్నారు. మూసీ వెంబడి ఫెన్సింగ్ వేయడంతోపాటు మూసీలో చెత్త వేయకుండా, కబ్జాలకు గురి కాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలన్నారు.

మూసిని అభివృద్ధి చేయడంతోపాటు సుందరికరిగించడం పైన రెవెన్యూ, హెచ్ఎండీఏ, జలమండలి విభాగాలతో కలిసి సమన్వయం చేసుకోవాలని సూచించారు. జలమండలి చేపడుతున్న మురుగు నీటి శుద్ధి కేంద్రాలకు సంబంధించి ప్రణాళికలు, మూసి అభివృద్ధి ప్రణాళికలు సమన్వయంతో సమాంతరంగా ముందుకు పోయేలా చూసుకోవాలన్నారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టబోయే భవిష్యత్ ప్రణాళికల పైన చర్చించేందుకు త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. మూసీ కార్పొరేషన్ ఎండి గా నియమితులైన విశ్వజిత్ కంపాటి తో పాటు జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -