మున్సిపల్ అధికారులపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు..

16
ktr

పట్టణ ప్రగతి కార్యక్రమంపై హైదరాబాద్‌లో నిర్వహించిన అవగాహన మరియు కార్యాచరణ సదస్సులో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి, మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్‌లు మున్సిపల్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. పట్టణ ప్రగతి కింద చేపట్టే కార్యక్రమాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మున్సిప‌ల్ అధికారులు, సిబ్బందిపై ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. మున్సిప‌ల్ జాబ్ థ్యాంక్ లెస్ జాబ్ అని కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మేయ‌ర్లు, చైర్మ‌న్లు, కౌన్సిల‌ర్ల కంటే మున్సిప‌ల్ అధికారులు, సిబ్బంది 24 గంట‌ల పాటు క‌ష్ట‌ప‌డుతున్నారు.. అలాంటి వారిని అంద‌రం గౌర‌వించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు కేటీఆర్.

రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్పుడు 68 మున్సిపాలిటీలు మాత్ర‌మే ఉండే. ఇప్పుడు కొత్త‌గా 74 మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకున్నాం. దీంతో మున్సిపాలిటీల సంఖ్య 142కు చేరింద‌న్నారు. అన్ని మున్సిపాలిటీల్లో నిర్విరామంగా మున్సిప‌ల్ అధికారులు, సిబ్బంది అంద‌రూ ప‌ని చేస్తున్నారు. మున్సిప‌ల్ సిబ్బంది ప‌ని చేయ‌ట్లేదంటే నేను ఒప్పుకోను. మున్సిప‌ల్ సిబ్బంది చేస్తున్నంత గొడ్డు చాకిరి రాష్ట్ర ప్ర‌భుత్వంలోని ఏ ఇత‌ర డిపార్ట్‌మెంట్ కూడా చేయ‌డం లేదంటే అతిశ‌యోక్తి కాదు. మీరు ప్ర‌తి రోజు ఊరుని శుభ్రంగా ఉంచినా ఎవ‌రూ మిమ్మ‌ల్ని అభినందించారు. ఒక వేళ వారం రోజుల పాటు బంద్ పెడితే.. కౌన్సిల‌ర్ నుంచి మంత్రి దాకా ఫోన్లు చేసి తిడుతారు. ఎందుకంటే ఈ జాబ్ థ్యాంక్ లెస్ జాబ్ అని కేటీఆర్ పేర్కొన్నారు.

చాలా మున్సిపాలిటీల‌ను అప్ గ్రేడ్ చేశాం.. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేశాం. కానీ మున్సిప‌ల్ శాఖ‌కు అద‌న‌పు సిబ్బందిని ఇవ్వ‌లేదు. కొత్త మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌ను కూడా రిక్రూట్ చేయ‌లేదు.. ఇప్పుడు రిక్రూట్ చేస్తున్నాం. ఉన్న సిబ్బందితోనే ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి అమ‌లు చేసి ఉరుకులు పరుగులు పెట్టించి ప‌ని చేయించాం. 24 గంట‌ల పాటు వారు క‌ష్ట‌ప‌డుతున్నారు. వారిని అభినందించాల‌ని కౌన్సిల‌ర్ల‌కు, చైర్మ‌న్ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. మీరు క‌ష్ట‌ప‌డుత‌లేర‌ని నేను అన‌డం లేదు.. కానీ మీ కంటే ఎక్కువ‌గా మున్సిప‌ల్ సిబ్బంది క‌ష్ట‌ప‌డుతున్నారు. ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డ్డాం. వారు గ‌వ‌ర్న‌మెంట్ స‌ర్వీస్ నుంచి వ‌చ్చినవారు. వారిని గౌర‌వించాల‌ని కేటీఆర్ సూచించారు.

తెలంగాణ‌లో 46 శాతం ప‌ట్ట‌ణీక‌ర‌ణ పెరిగింద‌ని కేటీఆర్ తెలిపారు. రాబోయే 5 నుంచి ఏడేండ్ల‌లో మెజార్టీ ప్ర‌జ‌లు 51 శాతం ప‌ట్ట‌ణాల్లోనే నివ‌సించ‌బోతున్నారు. ఇండియా గ్రామాల్లో నివ‌సిస్తుంద‌ని గాంధీ అన్న మాట చాలా మేర‌కు వాస్త‌వ‌మైంది. 75 శాతం భార‌త‌దేశం గ్రామాల్లోనే ఉంది. కానీ తెలంగాణ‌లో 46 శాతం జ‌నాభా ప‌ట్ట‌ణాల్లో ఉందన్నారు. భార‌త‌దేశ ఎకాన‌మీ ముందుకుపోతుందంటే అందుకు ప‌ట్ట‌ణాలే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ జీఎస్డీపీ 2014లో 5 ల‌క్ష‌ల 6 వేల కోట్లు.. ఈ ఏడేండ్ల‌లో అన్ని రంగాల్లో బ‌హుముఖంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు జీఎస్డీపీ 11 ల‌క్ష‌ల 55 వేల కోట్ల‌కు చేరింది. సింహాభాగం జీఎస్డీపీ ప‌ట్ట‌ణాల నుంచే వ‌స్తోంది. హైద‌రాబాద్ నుంచి 45 శాతం జీఎస్డీపీ వ‌స్తోంది. మిగ‌తా మున్సిపాలిటీలు, ప‌ట్ట‌ణాల నుంచి మ‌రో 20 శాతం జీఎస్డీపీ వ‌స్తోంది. ప‌ట్ట‌ణాలు ప్ర‌ధాన ఆర్థిక వ‌న‌రుగా మారాయి. గ‌త ఐదు వేల సంవ‌త్స‌రాలు జ‌రిగిన ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌.. రాబోయే ఐదేండ్ల‌లో మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు.

ఉపాధి, మెరుగైన వైద్య‌, విద్య కోసం ప‌ట్ట‌ణాల‌కు వ‌స్తున్నారు. మ‌న పిల్ల‌ల భ‌విష్య‌త్, జీవ‌న ప్ర‌మాణాలు పెర‌గాల‌ని ప్ర‌తి పేరెంట్ కోరుకుంటాడు. అందుకు ప‌ట్ట‌ణాల‌కు రావ‌డం స‌హ‌జం అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం.. 1 ల‌క్ష 12 వేల పైచిలుకు చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు. అందులో హైద‌రాబాద్‌ను తీసుకుంటే 675 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు మాత్ర‌మే. ఇక్క‌డే కోటి 20 ల‌క్ష‌ల మంది ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గాన్ని తీసుకుంటే.. అక్క‌డ 4 ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న‌ది అనుకుంటే.. కామారెడ్డి ప‌ట్ట‌ణంలోనే ల‌క్ష మంది ఉంటారు. ఈ క్ర‌మంలో ప‌ట్ట‌ణాల్లో అనేక స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయి. వాట‌న్నింటిని అధిగమించాలంటే ప‌క్కా ప్ర‌ణాళికతో ముందుకు వెళ్లాలి. జ‌న‌సాంద్ర‌త‌కు త‌గ్గ‌ట్టుగా మౌలిక వ‌స‌తులు క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప‌ట్ట‌ణాల‌ను మంచిగా అభివృద్ధి చేసి భ‌విష్య‌త్ త‌రాల‌కు అందించాల‌ని కేటీఆర్ సూచించారు.