వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై ప్ర‌భుత్వం దృష్టి- కేటీఆర్

240
ktr
- Advertisement -

వ‌ర‌ద స‌హాయ‌క పున‌రావాస చ‌ర్య‌ల‌పై ప్ర‌భుత్వం దృష్టి సారించిన‌ట్లు రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌కరామారావు తెలిపారు. సోమ‌వారం జిహెచ్ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, చీఫ్ సెక్ర‌ట‌రి సోమేశ్‌ కుమార్‌, పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌, ఇ.వి.డి.ఎం డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి ల‌‌తో క‌లిసి అధికారుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను మంత్రి స‌మీక్షించారు.

అనంత‌రం మీడియా ప్ర‌తినిధుల‌తో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ‌త ప‌ది రోజులుగా ఎడ‌తెరిపిలేని భారీ వ‌ర్షాల వ‌ల‌న జిహెచ్ఎంసి ప‌రిధిలో దాదాపు 37 వేల కుటుంబాలు వ‌ర‌ద ముంపుకు గుర‌య్యాయి. వ‌ర‌ద స‌హాయంగా రూ. 1350 కోట్లు ఇవ్వాల‌ని ప్ర‌ధాన మంత్రిని రాష్ట్ర‌ ప్ర‌భుత్వం కోరింది. కేంద్రం నుండి సానుకూల స్పంద‌న వ‌స్తుంద‌ని ఆశిస్తున్నామన్నారు. వ‌ర‌ద‌ల వ‌ల‌న న‌గ‌రంలో రూ. 670 కోట్ల విలువైన రోడ్లు, డ్రైన్లు, నాలాలు ఇత‌ర ఆస్తుల‌కు న‌ష్టం జ‌రిగిన‌ట్లు ప్రాథ‌మికంగా అంచ‌నా. వ‌ర‌ద‌ స‌హాయ‌క ప‌నుల‌పై రూ. 60 కోట్లు ఖ‌ర్చు చేశామన్నారు మంత్రి.

వ‌ర‌ద ప్ర‌భావిత‌, లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేస్తూ, స‌హాయ‌, పున‌రావాస చ‌ర్య‌ల‌ను పెద్ద ఎత్తున చేప‌ట్ట‌డం జ‌రిగింది. ఈ స‌హాయ పున‌రావాస ప‌నుల‌లో జిహెచ్ఎంసి మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ, రెవెన్యూ, పోలీసు, డి.ఆర్‌.ఎఫ్ బృందాలు నిరంత‌రం శ్ర‌మిస్తున్నాయి. వేల మందిని స‌హాయ కేంద్రాల‌కు త‌ర‌లించ‌డం జ‌రిగింది. స‌హాయ పున‌రావాస కేంద్రాల్లో ఉచిత‌ భోజ‌న వ‌స‌తి క‌ల్పించాం. పున‌రావాస కేంద్రాల్లో మ‌రుగుదొడ్డి స‌దుపాయం ఉన్న‌ది. అలాగే దుప్ప‌ట్లు కూడా అంద‌జేస్తున్నాం. ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి వైద్య సేవ‌లు అందిస్తున్నామన్నారు.

వ‌ర‌ద ముంపు ప్ర‌భావానికి గురైన 37 వేల కుటుంబాల‌కు సి.ఎం రిలీఫ్ కిట్‌ల‌ను అందిస్తున్నాం. ప్ర‌తి సి.ఎం రిలీఫ్ కిట్‌లో రూ. 2,800/- విలువైన నిత్యావ‌స‌ర వ‌స్తువులు, 3 బ్లాంకెట్లు అందిస్తున్నాం. వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కై స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్ చేప‌ట్టాం. అలాగే క్రిమీసంహార‌కాల‌ను స్ప్రే చేస్తున్నాం. భ‌వ‌న నిర్మాణ‌, శిథిలాల వ్య‌ర్థాల‌ను తొల‌గిస్తున్నాం. వ‌ద‌ర‌ల వ‌ల‌న దుర‌దృష్ట‌వ‌శాత్తు జిహెచ్ఎంసి, చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో 33 మంది మృతి చెందారు. వారిలో 29 మందికి రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేసియాగా ప్ర‌భుత్వం అంద‌జేసింది. భారీ వ‌ర్షాలు వ‌ర‌ద‌ల వ‌ల్ల ముంపుకు గురైన ప్రాంతాల్లో దెబ్బ‌తిన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ల మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాం. ఇప్ప‌టి వ‌ర‌కు 920 ట్రాన్స్ ఫార్మ‌ర్లను పున‌రుద్ద‌రించాం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మ‌ర‌ల వ‌ర‌ద నీరు చేరినందున ఎల్బీన‌గ‌ర్‌, చార్మినార్ జోన్ల‌లో కొన్ని చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేయ‌డం జ‌రిగింది. ప్ర‌మాదాల నివార‌ణ‌కు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకునే విద్యుత్‌ను పున‌రుద్ద‌రిస్తున్నామని మంత్రి తెలిపారు.

రాబోయే మూడు రోజుల పాటు భారీ ఎత్తున వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీచేసింది.ప్రాణ న‌ష్టాన్ని నివారించుట‌కు అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిపిన మంత్రి కేటీఆర్. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు పున‌రావాస కేంద్రాల‌కు వెళ్లాలి. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించుట‌కు ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటున్నాం. జిహెచ్ఎంసి డి.ఆర్‌.ఎఫ్ విభాగంలో ఉన్న 18 బోట్ల‌తో పాటు ఏ.పి, క‌ర్ణాట‌క ల నుండి మ‌రో 32 బోట్లు తెప్పిస్తున్నాం. గ‌త ప‌ది రోజుల నుండి నీళ్ల‌లో నానిన భ‌వ‌నాల పునాధులు, గోడ‌లు బ‌ల‌హీన‌ప‌డి దెబ్బ‌తినే అవ‌కాశం ఉన్నందున పై అంత‌స్తుల‌లో ఉంటున్న కుటుంబాలు కూడా పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లిరావాలి. ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో ఉండ‌రాద‌ని ప్ర‌జ‌ల‌కు మంత్రి కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు.

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్దు. అధికారుల‌కు స‌హ‌క‌రించాలి. వ‌ర‌ద ముంపు ప‌రిస్థితిని అదిగ‌మించుట‌కు ప్ర‌భుత్వం చేప‌ట్టిన స‌హాయ‌, పున‌రావాస చ‌ర్య‌ల్లో భాగ‌స్వాములు కావాల‌ని శాస‌న మండ‌లి, శాస‌న‌ స‌భ్యులు, కార్పొరేట‌ర్లు, ఎన్‌.జి.ఓల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. వ‌ర‌ద బాదిత కుటుంబాల‌ను ఆదుకునేందుకు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రూ. 10 కోట్ల స‌హాయాన్ని విరాళంగా ప్ర‌క‌టించింది. అలాగే వేల సంఖ్య‌లో బ్లాంకెట్లు పంపిస్తామ‌ని తెలిపారు. అందుకు ప్ర‌భుత్వం త‌ర‌ఫున త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు మంత్రి కేటీఆర్.

- Advertisement -