ఐటీ ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించాలిః మంత్రి కేటీఆర్

333
ktr
- Advertisement -

కరోనా వైరస్ పరిస్ధితుల నేపథ్యంలో ఐటి పరిశ్రమ వర్గాలతో మంత్రి కే. తారకరామారావు ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. వివిధ ఐటీ సంస్ధలు, సంఘాల ప్రతినిధులతో పరిమిత స్థాయిలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ పలు సూచనలు ఇచ్చారు. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, ఈ మేరకు ఈ నెలాఖరు వరకు వివిధ కార్యక్రమాలపైన, విద్యసంస్ధలతోపాటు ఇతర సంస్ధల కార్యక్రమాలపైన పరిమితులు విధించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలియజేశారు. హైదరాబాద్ నగరంలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వివిధ ప్రభుత్వ విభాగాలతో కలిసి ప్రభుత్వం తన ప్రయత్నం చేస్తున్నదని ఈ సందర్భంగా మంత్రి వారికి వివరించారు. మంత్రి కెటియార్ తో సమావేశమైన ఐటి పరిశ్రమ వర్గాలు, తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలపై హర్షం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా రెండు వారాల కిందట ఐటీ పరిశ్రమల సిబ్బంది, వైరస్ వ్యాప్తిపైన భయాందోళనలు నెలకొన్నప్పుడు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మరియు స్థానిక పోలీసు కమిషనర్ ఐటీ పరిశ్రమకు అండగా నిలిచి భరోసా కల్పించారన్నారు. మరోవైపు ప్రస్తుతం ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల కనుగుణంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసిందని, వీటికి అనుగుణంగా కార్యకాలపాలు నిర్వహించాలని ఐటి కంపెనీల ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా శానిటేషన్ మరియు ఏంట్రీ పాయింట్లలో నిరంతర చెకింగ్ వంటి కార్యక్రమాలను కొనసాగించాలన్నారు. ఇతర దేశాల్లో పర్యటించి వచ్చిన ఉద్యోగులతో పాటు భవిష్యత్తులలో కంపెనీల కార్యకలాపాల కోసం వచ్చేటువంటి ప్రతినిధులను ముందుగా క్వారైంటైన్ పిరియడ్ పాటించేలా చూడాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం అవసరమైతే వైద్య ఆరోగ్యశాఖ నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైరస్ వ్యాప్తికి సంబంధించి ఎలాంటి ఆందోళన అవసరం, ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని మంత్రి వారికి భరోసా ఇచ్చారు. ఐటీ పరిశ్రమకు అనుబంధంగా సేవలందిస్తున్న సపోర్ట్ స్టాప్ ఐన అసంఘటిత రంగం కార్మికులు సిబ్బందికి, ఈ వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశమున్న నేపథ్యంలో వారికి ఇవ్వాల్సిన వేతనాల విషయంలో సానుకూల దృక్పథంతో పరిశీలించాలని ఈ సందర్భంగా మంత్రి ఐటీ కంపెనీల ప్రతినిధులను కోరారు.

వైరస్ వ్యాప్తిని కట్టడి కోసం పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఐటీ కంపెనీలను మంత్రి కెటియార్ కోరారు. త్వరలోనే పరిస్థితి అంతా సర్దుకుంటుందన్న విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఐటీ పరిశ్రమలో పని చేస్తున్న ఉద్యోగుల యోగ క్షేమాల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్న మంత్రి, భవిష్యత్తు పరిస్ధితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ సమావేశంలో నాస్కామ్, హైసియా(HYSEA), సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ లకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరితోపాటు టిసియస్, ఇన్పోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, కాగ్నిజంట్, గూగూల్, క్వాల్ కామ్, స్టేట్ స్ర్టీట్ వంటి కంపెనీల హైదరాబాద్ అధిపతులుతోపాటు పరిశ్రలు, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, సైబారాబాద్ కమీషనర్ సజ్జనార్ ఈ సమావేశానికి హజరయ్యారు.

- Advertisement -