రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు – మంత్రి కొప్పుల

93
- Advertisement -

మార్చి 7తేదీలోగా దళిత బంధు పథకం క్రింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మందికి లబ్ది చేకూర్చాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు, ఎస్సీ కార్పొరేషన్ జిల్లాధికారులతో దళిత బంధు పథకంపై ఆయన సీఎస్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా తీసుకున్న కార్యక్రమం దళిత బంధని, దేశంలోనే ప్రత్యేకంగా దళితుల కోసం తీసుకున్న గొప్ప పథకమని అన్నారు. రాష్ట్రంలోని హుజరాబాద్ నియోజకవర్గం, వాసాలమర్రి గ్రామం మరియు మరో 4 మండలాలలో పూర్తిస్థాయిలో దళిత బంధు పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ పరిధిలో కనీసం 100 మంది దళితులకు పథకం అమలు చేయాలని సీఎం నిర్ణయించారని మంత్రి తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని పూర్తి చేయుటకు గ్రౌండ్ లెవెల్‌లో లబ్ధిదారులను ఎంపిక చేసుకొని లక్ష్యం మేరకు లబ్ది చేకూర్చలన్నారు. దళిత బంధుతో నిరుపేద షెడ్యూల్ కులాల ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచాల్సిన అవసరముందని, జిల్లాల్లో దళిత బంధు అమలుకు అవసరమైన కమిటీలు ఎర్పాటు చేసుకొని కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని త్వరగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. నిరుపేద దళిత కుటుంబాలలో ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రభుత్వం పది లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నందున, అందుకు తగిన పథకాలను రూపొందించి అమలు పరచాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు మంత్రి.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మాట్లాడుతూ.. అసెంబ్లీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఉన్న జిల్లా కలెక్టర్, సదరు అసెంబ్లీ కు ఉన్నతాధికారిని దళిత బంధు అమలు ప్రత్యేక అధికారిగా నియమించాలనీ ఆదేశించారు. జిల్లాలలోని కలెక్టర్లు స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని లబ్ధిదారులను ఫిబ్రవరి 5 లోపు ఎంపిక చేయాలని సీఎస్ ఆదేశించారు. లబ్ధిదారులను గుర్తించే క్రమంలో ప్రతి నియోజకవర్గంలో అర్హులను సంబంధిత శాసన సభ్యుల ఆమోదంతో ముందుగా 100 మంది లబ్దిదారులను గుర్తించి, జిల్లా కలెక్టర్, అధికారుల పరిశీలన అనంతరం ఆ జిల్లాకు చెందిన మంత్రి సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ఎంపిక చేసిన లబ్దిదారులకు రెండు రోజుల్లో ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎంపిక చేసిన 100 మంది లబ్ధిదారులకు అవసరమైన శిక్షణ అందించి మార్చి మొదటి 7లోగా లబ్ది చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దళిత బంధు ద్వారా ఎస్సీ లబ్దిదారులకు లబ్ది చేకూర్చలని, తదనుగుణంగా మరింత మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ అధికారులకు సూచించారు.

- Advertisement -