దళితులకు వరం దళిత బంధు- మంత్రి కొప్పుల

51

దళితుల సంక్షేమానికి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహంగా, నిబద్దతతో పనిచేస్తుందని దీనికి చక్కని ఉదాహరణ దళిత బంధు పథకం అని, నిన్నటి వరకు ఒకరి దగ్గర డ్రైవర్ గా పని చేసిన దళితుడు నేడు అదే వాహనానికి ఓనర్ గా మారడం దళిత బంధు గొప్పతనాన్ని తెలియజేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో దళిత బంధు లబ్ధిదారులకు రాష్ట్ర పౌర సరఫరాలు, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి దళిత బంధులో ఎంపికైన లబ్ధిదారులకు నాలుగు యూనిట్లు వాహనాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం దళిత బంధును కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలేట్ ప్రాజెక్టుగా ఈ నెల 16న ప్రారంభించి ఇదే నెలలో లబ్ధిదారులకు వాహనాలందించడం అభినందనీయం అని అన్నారు. దళిత బంధు పథకానికి ఇప్పటి వరకు 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. హుజరాబాద్ నియోజకవర్గం లోని 21 వేల దళిత కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని మంత్రి తెలిపారు.

ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం వీలు కల్పిస్తుందని అన్నారు. మొదటి విడుతగా దళీత బంధు ప్రారంభోత్సవంలో 15 చెక్కులను సిఎం అందించారని, నాలుగు యూనిట్ల క్రింద నేడు లబ్ధిదారులకు 2 ట్రాక్టర్లు, ఒక ట్రాలీ, ఒక కారు అందజేశామని మంత్రి తెలిపారు. దళిత బంధు ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతామన్న నమ్మకం, ధైర్యం దళితుల్లో కనబడిందని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రులు దళిత బంధు పథకం కింద దాసారపు స్వరూప రాజయ్య దంపతులకు ట్రాక్టర్, ఎలుక పల్లి కొమరమ్మ – కనకయ్య దంపతులకు ట్రాక్టర్, జి సుగుణ – మొగలి దంపతులకు ట్రాలీ, రాచపల్లి శంకర్‌కు మారుతి కారును అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై. సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ , రవాణా శాఖ ఉప కమీషనర్ ఎం. చంద్ర శేఖర్ గౌడ్, ఈ డి ఎస్సీ కార్పొరేషన్ సురేష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.