సూర్యాపేటలోని 20 వార్డ్ జమ్మిగడ్డలో పట్టణ ప్రగతిలో భాగంగా మహిళలకు ఇంటి పంటపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మహిళలకు జూట్ బ్యాగ్ లు, తడి చెత్త, పొడి చెత్త బాస్కెట్ లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, ఆర్డీవో మోహన్ రావు, మున్సిపల్ కమిషనర్ రామంజిరెడ్డి, కమిషనర్ మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ ,ఇంటి పంట ఎక్స్పర్ట్ , సైoటిస్ట్ శ్యామ్ సుందర్ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, కౌన్సిలర్ అన్నేపర్తి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట పట్టణ ప్రగతి అంటే కేవలం పరిసరాల పరిశుభ్రతే కాదు.. ప్రజల ఆరోగ్యం ఉంచడంతో పాటు వారు ఆరోగ్యంగా ఉండేందుకు చేయవలసిన కార్యాచరణపై మంత్రి జగదీశ్ రెడ్డి దృష్టి సారించారు. తమ తమ ఇళ్ల లొనే పరిశుభ్రమైన కాయగూరలు, ఆకుకూరలు వంటి ఇంటి పంటలను సాగు చేయడంపై వార్డుల వారీగా ఇంటి పంట ఎక్స్పర్ట్స్ , శాస్త్రవేత్తలతో అవగాహన కలిపిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు స్వయంగా హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ఇంటి పంటలతోనే ఆహారం.. ఆరోగ్యం..ఆనందం అని అన్నారు.మనమెలా ఉండాలన్నది మనం తినే ఆహారమే నిర్ణయిస్తుందన్నారు.
ప్రస్తుత కాలం ప్రస్తుత సమాజంలో పేదరికాన్ని మనం జయించవచ్చు గానీ, అనారోగ్యాన్ని భరించ గలిగే పరిస్థితులలో మనం లేమన్నారు. తరాలు మారిన కొద్దీ మారిన మన ఆహారపు అలవాట్ల మారడం వల్ల ఆ ప్రభావం మన ఆరోగ్యాలపై కూడా పడిందన్నారు. ఈ తరుణంలో ఎవరికి వారు తమకు అందుబాటులో ఉన్న కొద్దీ స్థలంలో ఇంటికి అవసరమైన పంటలు మనమే పండించుకోవడం ఉత్తమ మార్గమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. పట్టణాల్లో ఖాళీ స్థలాలు దొరకడం కష్టమైన నేపధ్యంలో ఎవరి ఇంటి మీద వారు అవసరమైన మేరకు కుండీలు ఏర్పాటు చేసుకుని పూర్తి సహజ పద్ధతుల్లో పంటలు పండించుకోవచ్చన్నారు.
తక్కువ ఖర్చుతో,వంటింటి వ్యర్ధలతో చేసిన కంపోస్టుతో పూర్తి అరోగ్యకరమైన ఆకుకూరలు, కూరగాయలు, సాగుచేయవచ్చన్నారు. నిజానికి ఇది ఒక ఇంటికి సరిపోను సంపూర్ణ ఆరోగ్యం అని మంత్రి అన్నారు. కాబట్టి పట్టణంలో ప్రతీ ఒక్కరు ఇంటి పంటలపై దృష్టి పెట్టాలన్నారు. ఇంటి పంటల సాగు చేయడానికి ముందుకు వచ్చే వారికి మున్సిపల్ తరుపున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు.ఇంటిపై కూరగాయలు పండించుకోవడం ద్వారా వారికి లాభం కలగడంతో పాటు సమాజానికి కూడా ఎంతో లాభమన్నారు.
కాబట్టి రాష్ట్రంలోనే మొట్ట మొదటగా సిర్యాపేట పట్టణంలో జరువుతున్న ఇంటి పంట ఉద్యమంలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలని మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. సిర్యాపేటను ఆరోగ్యవంతమైన పట్టణంగా మార్చి భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందిద్దాం అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఇంటి పంటను పండించిన మమత అనే మహిళలను మంత్రి సన్మానించారు. అంతకు ముందు జమ్మిగడ్డలో మొక్కలు నాటిన మంత్రి మహిళలకు జూట్ బ్యాగ్ లను పంపిణీ చేయడంతో పాటు, తడి చెత్త పొడి చెత్త బాస్కెట్ లను పంపిణీ చేశారు.