నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతుగా మంత్రులు జగదీష్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ నెల్లికల్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. టీఆర్‌ఎస్‌కు ఓటు వేయడం వల్లే రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీరు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు.
ప్రజలకు మేలు చేయడానికి జనారెడ్డికి 40 ఏండ్లు సరిపోలేదా అని ప్రశ్నించారు. నెల్లికల్ ప్రజలకు గుర్తుండిపోయే అభివృద్ధి పని జానారెడ్డి ఒక్కటైనా చేశాడా అని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్‌తో ఈ ప్రాంతంలో రెండు పంటలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా టీఆర్‌ఎస్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నదని వెల్లడించారు.
ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నాగార్జునసాగర్ అభివృద్ధి గుర్తుకు రాలేదా అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు చేయలేని వ్యక్తి ప్రజలకు ఇప్పుడేం చేస్తాడని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని చెప్పారు.