రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి అభివృద్ధి పనులతోపాటు తెలంగాణకు హరితహారం కార్యక్రమాలకు మొదటి ప్రాధ్యతనివ్వాలని అటవీ, పర్యా,వరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యా గార్డెన్‌లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం, పరిశుభ్రత, తదితర కార్యక్రమాల పురోగతిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సుధీర్ఘంగా సమీక్షించారు. పట్టణ, పల్లె ప్రగతి పనులపై అంశాల వారీగా అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రాధాన్యత పనులు చేపట్టాలన్నారు. ఏ రాష్ట్రంలో కూడా పల్లె, పట్టణాల అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమం అమలు కావడం లేదని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామ పంచాయతీలకు ప్రతీ నెల నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలు, మున్సిపాలిటీలు పచ్చదనంతో పాటు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలను గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో పక్కాగా అమలు చేయలన్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవు:
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనులు అమలుకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లను నియమించినట్లు తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేశారని, అధికారులు ఇదొక అవకాశంగా భావించి గ్రామాల అభివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేసి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. సీయం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి పనులను ఆకస్మికంగా పరిశీలిస్తారని, పనులు మంచిగా ఉంటే ప్రశంసలు ఉంటాయని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, ప్రజాప్రతినిదులపై వేటు తప్పదని హెచ్చరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, గ్రామీణ,పట్టణాభివృద్ధి శాఖ అధికారులు సమిష్టిగా పని చేయాలన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పనులు భేష్:
గ్రామీణ ప్రాంతాల్లో డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు నూటికి నూరు శాతం పూర్తయ్యాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పచ్చదనం కనబడుతుందన్నారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కూడా పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని, మిగిలిన పనులన్నీ త్వరితగతిన పూర్తయ్యేలా ప్రజాప్రతినిదులు, అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పనుల నాణ్యతలో రాజీ పడవద్దు:
పనులు నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వైకుంఠ ధామాల నిర్మాణం ప్రగతి పై పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. కంపోస్ట్ షెడ్ లు నిర్మాణం పూర్తి చేయడమే కాక చెత్త సెగ్రి గేషన్ జరగాలని, వాటిని వాడుకలో తీసుకు రావాలని, చెత్త సేకరణ చేసి డంప్ యార్డ్ తరలించి చెత్త వేరు చేయాలని అన్నారు.
అనుమతి ఉన్న దుకణాల్లోనే విత్తనాలు కొనండి:
నకిలీ పత్తి విత్తనాల నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. నాసిరకం, నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న కేటుగాళ్ళపై పీడీ యాక్టు క్రింద కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. నకిలీ విత్తనాలను కొని రైతులు మోసపోవద్దని సూచించారు. అనుమతి ఉన్న దుకాణాల్లోనే విత్తనాలను కొనుగోలు చేయాలని కోరారు. కొన్న విత్తనాలకు రసీదు తీసుకొని, నకిలీ విత్తనాల ముఠాలకు చెక్ పెట్టాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు మీ దృష్టికి వస్తే సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు.
హరితహారం మొక్కల సంరక్షణ:
హరితహారం కార్యక్రమం త్వరలో ప్రారంభం కానున్నందున సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హరితహారంలో నాటిన మొక్కలు 85 శాతం సజీవంగా ఉండేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే నూతన పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టంలో పేర్కొన్నట్లు మున్సిపల్, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిలదే బాధ్యత అని అన్నారు. నూతన చట్టం ప్రకారం బడ్జెట్లో 10 శాతాన్ని గ్రీన్ బడ్జెట్ గా వినియోగించాలని సూచించారు. మొక్కలు బతికేలా గ్రామ పంచాయతీలలో ఉన్న ట్రాక్టర్లు, ట్యాంకర్ల ద్వారా ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కే.విజయలక్ష్మి, కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖీ, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.