నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర,అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వరి ధాన్యం కొనుగోళ్లపై రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాణ్యత ప్రమాణాలు పాటించి ధాన్యం కొనుగోళ్ళను చేపట్టాలని అన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు 196 కేంద్రాలకు గాను 100 కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, ఇప్పటివరకు 9279.880 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు.
పది లక్షల గన్నీ బ్యాగులను కొనుగోలు కేంద్రాలకు పంపిణీ చేయడం జరిగిందని, 13లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల వలన ధాన్యం తడవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, రైస్ మిల్లర్లు లారీ యజమానులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ పి రాంబాబు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, అధికారులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.