సీజనల్ వ్యాధులపై మూడంచెల వ్యూహం: హరీశ్ రావు

23
harishrao
- Advertisement -

వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను కాపాడేందుకు మూడంచెల విధానం అనుసరించాలని ఆదేశించారు. అవగాహన కల్పించడం,వ్యాధి నిర్ధారణ చేయడం, త్వరితగతిన చికిత్స అందించడం వంటివి చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాని, ఈ విషయంలో పంచాయతీ రాజ్ సహా ఇతర శాఖలు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత బృందంతో ప్రచారం చేయాలన్నారు.

మంగళవారం వెంగలరావు నగర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం నుండి రాష్ట్రంలోని నాలుగు ఐటిడిఏ పరిధిలోని జిల్లాల్లో సీజనల్ వ్యాధులపై మంత్రి హ‌రీశ్ రావు టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…మొన్నటి వరకు ఉన్న ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టి, వాతావరణం పూర్తిగా చల్లబడింది. రాష్ట్రమంతటా వానలు మొదలయ్యాయి. ఒక్కసారిగా వాతావరణం లో జరిగిన మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండాలి.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు వానాకాలంలో గిరిజన ప్రాంతాలు సీజనల్ వ్యాధులతో అల్లాడిపోయేవి. రోజులకు రోజులు మంచం పట్టేవి. పెద్ద సంఖ్యలో క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించాల్సి వచ్చేది. కానీ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అలాంటి పరిస్థితులు లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గ నిర్దేశంలో వైద్యం పల్లె ప్రజలకు చేరువడంతో పాటు, జ్వర సర్వే, ఇంటింటికి వెళ్లి మందులు ఇవ్వడం, సబ్ సెంటర్ల ఏర్పాటు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలు ఇందుకు దోహదం చేశాయి.
పల్లె ప్రగతి, డంపింగ్ యార్డులు, గ్రామానికి ఒక ట్రాక్టర్ వల్ల పారిశుధ్యం మెరుగైంది. మిషన్ భగీరథ ద్వారా శుద్ది చేసిన నీరు ప్రజలకు అందించడం వల్ల నీటి ద్వారా వచ్చే జబ్బులు తగ్గుముఖం పట్టాయి. మొత్తంగా ఒక గుణాత్మక మార్పు వచ్చింది. మలేరియా రహిత రాష్ట్రంగా అడుగులు వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. మలేరియా నియంత్రణలో కేటగిరీ 2 నుండి కేటగిరీ 1 కి చేరాము. గత ఏప్రిల్ లో కేంద్రం మనకు అవార్డు ఇచ్చింది. అయితే సీజనల్ వ్యాధుల విషయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటివి పూర్తి నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. ఒకటి, రెండు కేసులు నమోదు కాగానే ఆ ప్రాంతం పై ప్రత్యేక దృష్టి సారించాలి. అవసరం ఉన్న చోట ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేయాలి. సత్వర చికిత్స అందించాలన్నారు.

ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత లోపించడం, దోమలు, ఈగలు వ్యాప్తిచెందడం కారణంగా వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుధ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండడం వల్ల దోమలు, ఈగలు వృధ్ది చెంది అంటు వ్యాధులకు కారణమవుతాయి. అలా జరగకుండా చూసుకోవాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలి. వర్షపు నీటి గుంతల్లో, మురుగు కాల్వల్లో, తడిసిన చెత్త కుప్పల్లో, నల్లాల వద్ద నీటి గుంటలు వంటి ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ దోమల ద్వారా మలేరియా, బోదకాలు, డెంగీ, చికెన్ గున్యా వంటివి వ్యాపించే అవకాశం ఉందన్నారు.

- Advertisement -