ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో 2022 సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19 తేదీ వరకు జరిగే ప్రసిద్ధి చెందిన సమ్మక్క, సారలమ్మ జాతర- 2022 నిర్వహణకు ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సీఎం సీఎం కేసీఆర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జాతర అభివృద్ధి పనులు 21 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
జాతరలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి జాతరను సందర్శించే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్లాస్టిక్ రహితంగా జాతర నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో పనులు చేపట్టినట్లు ఆయన వివరించారు. మేడారంలో భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే అనేక శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలను చేపట్టినట్లు ఆయన తెలిపారు.