కేరళలో జరిగిన సౌత్ ఇండియా జూనియర్ అథ్లెటిక్స్ లో అండర్ -16 విభాగంలో 2 వేల మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించిన జనగామ జల్లా పాలకుర్తి నియోజకవర్గం గూడూరుకు చెందిన చెరిపెల్లి కీర్తనను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు.
మంగళవారం తనను తన క్యాంపు కార్యాలయం మినిస్టర్స్ క్వార్టర్స్ లో కలిసిన కీర్తనను మంత్రి ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, పాలకుర్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కీర్తన అసమాన ప్రతిభను కనబరుస్తూ, అండర్ -16 జూనియర్ అథ్లెటిక్ విభాగంలో స్వర్ణ పతకం గెలవడం సంతోషించదగ్గ విషయమన్నారు. గ్రామీణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కీర్తన ప్రతిభకు గురుకుల పాఠశాల పదను పెట్టిందన్నారు.
ప్రభుత్వం స్థాపించిన గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు అత్యంత మెరుగైన ఆహారం, వసతి, చదువు, క్రీడా ప్రోత్సాహం లభిస్తున్నదన్నారు. అందుకే గురుకుల పాఠశాలలో సీట్లకు బాగా డిమాండ్ పెరిగిందన్నారు. కీర్తనకు మరింత ప్రోత్సాహం లభిస్తే, పీటీ ఉష లా దేశానికి కీర్తిని తెచ్చి పేట్టే కీర్తన అవుతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా కీర్తనను ప్రోత్సహిస్తామన్నారు. గూడూరు కు చెందిన చెరిపెల్లి కీర్తన, చెరిపెల్లి నాగమణి – కుమార స్వామిల కూతురు. కాగా మంత్రిని కలిసిన వారిలో గూడూరు సర్పంచ్ మంద కుమరయ్య, మాజీ సర్పంచ్ పుల్లయ్య, పూజరి రమాకాంత్ తదితరులు ఉన్నారు.