ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇప్పటివరకు బాధితుల సంఖ్య 7,10,290 దాటగా 33 వేల 550 మంది చనిపోయారు. ఆదివారం ఒక్కరోజే 2,694 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లోనే 47,208 కి పైగా కేసులు నమోదయ్యాయి.
ఇక కరోనాపై పోరాటానికి తమ వంతుగా సాయం అందించేందుకు పలువురు ముందుకువస్తున్నారు. తాజాగా కరోనాపై పోరుకు తాను సైతం అంటూ ముందుకొచ్చారు ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్గ్ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిస్కిలా చాన్. తమ వంతు సహాయంగా పరిశోధనలకు గాను 25 మిలియన్ డాలర్ల (రూ.187.19 కోట్లు) విరాళం ప్రకటించారు.
విరాళాన్ని చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ (CZI) నుంచి అందించారు. ఈ సమయంలో మనకు పరిశోధకులే ముఖ్యమని చెప్పిన జుకర్ బర్గ్ వారికి అవసరమైన సహాయాన్ని అందించాలని అందరికి పిలుపునిచ్చారు. కరోనా వైరస్ కట్టడికి ప్రతిఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు..