ఆది పినిశెట్టి, నిక్కి గర్లాని హీరో,హీరోయిన్లుగా అడ్వంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం మరకతమణి. తెలుగు,తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. రీసెంట్‌గా ఆది విలన్‌గా నటించిన సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయారు. సస్పెన్స్ ప్రధానంగా థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంతో ఆది ఆకట్టుకున్నాడా..?ప్రేక్షకులను మెప్పించాడా లేదా చూద్దాం..
కథ:
అప్పుల బాధలతో సతమతమవుతున్న ఓ యువకుడు రఘునందన్ (ఆది పినిశెట్టి). అప్పుల బాధ నుంచి భయటపడేందుకు స్నేహితుడితో కలిసి స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో పెద్ద ఆఫర్ వస్తోంది. మరకతమణి అనే ఓ అరుదైన ఆభరణం తెచ్చిస్తే రూ.పది కోట్లు ఇస్తామని చైనాకి చెందిన ఓ వ్యాపారి ఆఫర్ ఇస్తాడు. అయితే మరకతమణిని ఎవరు తాకితే వాళ్లు ప్రాణాలు కోల్పోతుంటారు. కానీ రఘునందన్ మాత్రం తాను తెచ్చిస్తానని ఒప్పందం కుదుర్చుకొంటాడు. అంత ప్రమాదకరమైన మరకతమణిని ఎలా సంపాదించాడు? అసలు మరకతమణి వెనక కథేమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథనం, నటీనటులు, సంగీతం,సినిమాటోగ్రఫీ. ఆదిని ఎక్కువగా సీరియస్ పాత్రల్లోనే చూశాం. కానీ ఇందులో మాత్రం సరదా పాత్రలో కనిపించాడు. పాత్రకి తగ్గట్టుగా చక్కటి అభినయాన్ని ప్రదర్శించాడు. నిక్కీ గల్రానీ పాత్ర, ఆమె అభినయం సినిమాకి కొత్తదనాన్ని పంచింది. ఏ హీరోయిన్ చేయని ఓ విభిన్నమైన పాత్ర అని చెప్పొచ్చు. అమ్మాయైనా, అబ్బాయిలా కనిపిస్తూ నటించిన తీరు చాలా బాగుంది. డాన్ ట్వింకిల్ రామనాథం పాత్రలో ఆనంద్ రాజ్ అభినయం ఆకట్టుకుంటుంది. చేసింది డాన్ పాత్రే అయినా, ఆయన కనిపించిన ప్రతిసారీ నవ్వులు పండుతాయి. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
మైనస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ తమిళ నేటివిటీ, నెమ్మదిగా సాగే ఆరంభం, హీరో.. హీరోయిన్ల మధ్య సన్నివేశాలు లేకపోవడం. తెలుగు నేటివిటికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. సినిమా కథలోకి వెళ్లడానికి కాస్త సమయం పడుతుంది. ఆ సన్నివేశాల్ని భరిస్తే మాత్రం ఆ తర్వాత సరదాగా కాలక్షేపం అవుతుంది. లాజిక్ గురించి ఆలోచించకుండా ఈ సినిమాని చూడాలి. ఆత్మలు, వేరొకరి శరీరంలోకి ప్రవేశించడం లాంటివి వాస్తవానికి దూరంగా అనిపిస్తాయి.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా కూడా సినిమాకి మంచి మార్కులే పడ్డాయి. దిబు నైనన్ థామస్ సంగీతం, పి.వి.శంకర్ కెమెరా పనితనం చాలా బాగా కుదిరింది. దర్శకుడు ఎ.ఆర్.కె.శరవణన్ రాసుకొన్న కాన్సెప్టు, దాని చుట్టూ అల్లిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. కథనంతోనే రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
భిన్నమైన కథనంతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం మరకతమణి. నటీనటులు, కథనం, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ కాగా తమిళ నేటివిటీ, నెమ్మదిగా సాగే ప్రారంభం సినిమాకు మైనస్ పాయింట్స్. మొత్తంగా మరకతమణితో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడనే చెప్పాలి.
విడుదల తేదీ:16/06/2017
రేటింగ్ : 3/5
నటీనటులు: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని
సంగీతం: దిబు నైనన్ థామస్
నిర్మాణం: రిషి మీడియా,శ్రీ చక్ర ఇన్నోవేషన్స్
కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: ఎఆర్కే శరవణన్