వివాదంలో సింగర్‌ మంగ్లీ..!

89

ప్రముఖ గాయని మంగ్లీ వివాదంలో చిక్కుకుంది. తెలంగాణలో ఆషాఢం బోనాల సీజన్ సందర్భంగా ఆమె పాడిన పాటపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ‘చెట్టుకింద కూసున్నవమ్మా.. సుట్టం లెక్క ఓ మైసమ్మ’ అనే పాటను తన యూట్యూబ్‌ చానల్‌లో విడుదల చేశారు. ఆ పాటకు రామస్వామి సాహిత్యం అందించగా, రాకేశ్ వెంకటాపురం సంగీతం అందించారు. పండు కొరియోగ్రఫీ చేసిన ఈ పాటను మంగ్లీ పాడి, నర్తించారు. అయితే, ఆ భక్తి గీతంలోని కొన్ని పదాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మవారిని దూషిస్తున్నట్టుగా కొన్ని పదాలు ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి.

తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం వంటి బోనాలను కించపరిచేలా ఈ పాట ఉందని, దేవతను మొక్కినట్టుగా కాకుండా, తిడుతున్నట్టుగా ఉందని, ఇలాంటి పాటను మంగ్లీ ఎలా పాడిందని భక్తులు మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఈ గేయం ఉందని, మంగ్లీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే, ఆ పాటలోని పదాలను మార్చేయాలని స్పష్టం చేస్తున్నారు. మరి కొందరు సంగీత ప్రియులు మంగ్లీకి మద్దతుగా నిలిచారు. ‘ఎవరో రాసిన లిరిక్స్‌ ఆమె ఏం చేస్తుంది’ అంటూ సపోర్ట్‌ చేస్తున్నారు.